రైల్లో భోజనం రేటుపై గొడవ.. రూ.20 కోసం ప్రయాణికుడిని చితకబాదిన సిబ్బంది

Andaman Express Passenger Assaulted Over Food Price Dispute
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లో ఓ రైలులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.20 అదనంగా వసూలు చేయడాన్ని ప్రశ్నించినందుకు ఓ ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది కర్రలు, బెల్టులతో దాడి చేశారు. ఈ అమానవీయ సంఘటన ఝాన్సీ సమీపంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
నిహాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కత్రా నుంచి బినాకు అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన రైల్లో వెజ్ మీల్స్ ఆర్డర్ చేశారు. దాని ధర రూ.110 ఉండగా, క్యాటరింగ్ సిబ్బంది ఆయన వద్ద రూ.130 వసూలు చేశారు. దీనిపై నిహాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారని సిబ్బందిని ప్రశ్నించారు.

ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన క్యాటరింగ్ సిబ్బంది, నిహాల్‌పై దాడికి తెగబడ్డారు. కొందరు కర్రలు, మరికొందరు బెల్టులతో ఆయనను విచక్షణారహితంగా కొట్టారు. తోటి ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు లెక్కచేయకుండా దాడిని కొనసాగించారు. ఈ దాడి దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే సిబ్బంది తీరుపై మండిపడుతూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
Viral Video
Andaman Express
Indian Railways
Train assault
Catering staff
Passenger beaten
Jhansi
Railway incident
Overcharging

More Telugu News