సాధారణ పనులనూ నేరాలుగా చూస్తున్నారు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్

Justice Ujjal Bhuyan Routine activities are being treated as crimes says Supreme Court Judge
  • భారత్‌లో అసమ్మతి తెలిపేందుకు అవకాశాలు తగ్గుతున్నాయన్న జస్టిస్ భూయాన్
  • గంగా నదిలో చికెన్ తిన్న యువకుల అరెస్టును ఉదహరించిన న్యాయమూర్తి
  • నిరసనకారులకు బెయిల్ మంజూరులో జాప్యం, కఠిన షరతులపై విమర్శ
  • న్యాయమూర్తుల తీర్పులను విమర్శిస్తేనే వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాఖ్య
దేశంలో భిన్నాభిప్రాయాలు, అసమ్మతి తెలిపేందుకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, సాధారణ కార్యకలాపాలను కూడా నేరాలుగా పరిగణిస్తున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం భోపాల్‌లోని నేషనల్ లా ఇని‌స్టిట్యూట్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి చర్చ, అసమ్మతి ప్రాణవాయువు లాంటివని, కానీ ఇప్పుడు వాటికి చోటు లేకుండా పోతోందని అన్నారు.

ఈ సందర్భంగా గంగా నదిలో పడవపై చికెన్ బిర్యానీ తింటూ రంజాన్ ఉపవాస దీక్ష విరమించినందుకు 14 మంది ముస్లిం యువకులను అరెస్టు చేసిన ఘటనను ఆయన ఉదహరించారు. "గంగపై చికెన్ తినడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదు. కానీ ఆ కారణంగా వారిని అరెస్టు చేశారు. మూడు నెలల పాటు వారు జైలులో ఉండాల్సి వచ్చింది" అని జస్టిస్ భూయాన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు సాధారణ కార్యకలాపాలను సైతం నేరాలుగా ఎలా చిత్రీకరిస్తున్నారో చెబుతున్నాయని అన్నారు.

నిరసనకారులకు సంబంధించిన కేసుల్లో బెయిల్ మంజూరులో జాప్యం జరగడం, కోర్టులు కఠినమైన షరతులు విధించడంపైనా ఆయన దృష్టి సారించారు. బెయిల్ ఇచ్చేటప్పుడు బహిరంగ సభల్లో పాల్గొనవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని షరతులు విధించడం పౌరుల ప్రాథమిక హక్కులను నీరుగార్చడమేనని అభిప్రాయపడ్డారు.

న్యాయవ్యవస్థ కూడా విమర్శలకు అతీతం కాదని, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను న్యాయవాదులు, విద్యార్థులు విమర్శనాత్మకంగా పరిశీలించాలని జస్టిస్ భూయాన్ సూచించారు. అలా చేసినప్పుడే వ్యవస్థ మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. వ్యవస్థపై ప్రజలకు నమ్మకం నిలవాలంటే న్యాయమూర్తులు ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Justice Ujjal Bhuyan
Supreme Court of India
Freedom of Speech and Dissent
Criminalizing Routine Activities
Bail Conditions and Fundamental Rights
Indian Judiciary Criticism

More Telugu News