ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. తీర ప్రాంతాలకు హై అలర్ట్!

North Andhra faces depression threat high alert for coastal areas
  • నేడు ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం
  • ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక
  • సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ప్రభుత్వం సూచన
  • తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ప్రకటన
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఒడిశాలోని పారాదీప్ - పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని, భారీగా అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని తెలిపారు. జులై 29 వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేస్తోంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకు వేటను నిలిపివేయాలని స్పష్టం చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండకూడదని అధికారులు సూచించారు.                                
Advertisement
North Andhra
Bay of Bengal Depression
IMD Weather Alert
Andhra Pradesh Heavy Rains
APSDMA Warning
Odisha West Bengal Coast

More Telugu News