పిఠాపురం మహిళలకు పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక
- 10 వేల మందికి చీరలు, పసుపు, కుంకుమల పంపిణీకి ఏర్పాట్లు
- పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ
- ఆగస్టు 22న ఐదు విడతలుగా కార్యక్రమం
- కూపన్ల ఆధారంగా సమయాల కేటాయింపు
- ఏర్పాట్లలో పోలీసులు, జనసేన వాలంటీర్లు
ఈ నెల 22వ తేదీన పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ పాదగయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడి ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరపనున్నారు. ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు ఈ కానుకలను అందజేయనున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు, రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తారు. ప్రతి విడతకూ అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని అమ్మవార్ల పేర్లతో నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళల కోసం గురువారం నుంచే కూపన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రతి కూపన్‌పై నిర్దిష్ట సమయాన్ని ముద్రిస్తారు. మహిళలు తమకు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చే మహిళలకు కూడా కానుకలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ బృహత్కార్యక్రమాన్ని దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు సమన్వయంతో పర్యవేక్షించనున్నారు.