చైనా, పాక్‌లకు చెక్: భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్!

Rajnath Singh Approves Indigenous Stealth Fighter Jet Project
షార్ట్స్‌లో చూడండి
భారత రక్షణ రంగం మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగానే అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసుకునే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. చైనా తన వైమానిక శక్తిని వేగంగా విస్తరించుకోవడమే కాకుండా, పాకిస్థాన్‌కు కూడా అత్యాధునిక యుద్ధ విమానాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సరికొత్త యుద్ధ విమానం రెండు ఇంజన్లతో, ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్) సైనిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) పర్యవేక్షించనుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెలువరించిన ప్రకటన ప్రకారం, ఈ స్టెల్త్ ఫైటర్ ప్రోగ్రామ్‌ను పూర్తిగా దేశీయ సంస్థలే ముందుకు తీసుకెళతాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు బిడ్లు దాఖలు చేయవచ్చని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా, స్టెల్త్ విమానం నమూనా (ప్రోటోటైప్)ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ రక్షణ సంస్థల నుంచి ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఏడీఏ త్వరలో ఆహ్వానించనుంది. రక్షణ రంగంలో ప్రైవేటు తయారీని ప్రోత్సహించడంతో పాటు, దేశంలో యుద్ధ విమానాల తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)పై ఒత్తిడి తగ్గించేందుకే ఈ ఏడాది మార్చిలో ఒక ఉన్నత స్థాయి రక్షణ కమిటీ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి సిఫార్సు చేసింది.

ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఎక్కువగా రష్యా, ఫ్రెంచ్ యుద్ధ విమానాలే ఉన్నాయి. భారత వైమానిక దళంలో ఆమోదించిన 42 స్క్వాడ్రన్లకు గాను ప్రస్తుతం 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉండటంతో, ఈ కొరతను అధిగమించేందుకు కూడా స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్టు ఊతమిస్తుందని భావిస్తున్నారు.

చైనా తన వైమానిక దళాన్ని వేగంగా విస్తరించుకోవడమే కాకుండా, పాకిస్థాన్ వైమానిక దళ విస్తరణకు కూడా సహాయం చేస్తుండటంతో, భారత్ తన స్వదేశీ స్టెల్త్ విమాన ప్రాజెక్టును వేగవంతం చేయాలని నిర్ణయించింది. భారత్ ప్రస్తుతం ఐదో తరం సైనిక విమానాల అభివృద్ధిపై దృష్టి సారించగా, చైనా ఇప్పటికే తన ఆరో తరం యుద్ధ విమానం (చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన జే-36గా భావిస్తున్నారు) నమూనాను ప్రదర్శించి, పరీక్షలు కూడా నిర్వహించింది.

పాకిస్థాన్ వద్ద ఇప్పటికే చైనాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన జే-10 ఉంది. తాజా నివేదికల ప్రకారం, చైనా తన అత్యంత ఆధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ - షెన్యాంగ్ జే-35 (సింగిల్ సీటర్, ట్విన్ ఇంజన్, అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల స్టెల్త్, బహుళ ప్రయోజన యుద్ధ విమానం)ను పాకిస్థాన్‌కు రాయితీ ధరకే అందజేయడానికి ముందుకొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత స్వదేశీ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత పెరిగింది.
Go Back to Shorts
Rajnath Singh
Stealth Fighter Jet
Indian Air Force
HAL
China Pakistan
Defense Production

More Telugu News