Advertisement

బీజేపీకి అధికార ప్రతినిధి షెహ్‌జాద్‌ పూనావాలా రాజీనామా

Shehzad Poonawalla resigns as BJP national spokesperson
  • వ్యక్తిగత కారణాలే కారణమని సమాచారం
  • ‘ఎక్స్‌’ ప్రొఫైల్‌లో పదవి వివరాల తొలగింపు
  • కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నేత
  • సోదరుడు తహసీన్‌ కాంగ్రెస్‌ మద్దతుదారు
  • రాజీనామాపై వెలువడని అధికారిక ప్రకటన
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో తరచూ కనిపించే షెహ్‌జాద్‌ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన ‘ఎక్స్‌’ ప్రొఫైల్‌లో ‘బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి’ అనే ట్యాగ్‌ను తొలగించారు. అయితే ‘ప్రధాని నరేంద్ర మోదీ జీవితకాల అనుచరుణ్ని’ అనే ట్యాగ్‌లైన్‌ను మాత్రం అలాగే ఉంచారు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన షెహ్‌జాద్‌ తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించారు. 2017లో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేసి వార్తల్లో నిలిచారు. రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిగా చేయడానికే ఎన్నికల ప్రక్రియ సాగిందని అప్పట్లో ఆరోపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు.

ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకొనే సమయం వచ్చిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను షెహ్‌జాద్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆయన సోదరుడు తహసీన్‌ పూనావాలా ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్దతుగా టీవీ చర్చల్లో పాల్గొంటుంటారు. ఇద్దరు సోదరులు వేర్వేరు రాజకీయ పక్షాల తరఫున తరచూ వాదనలు వినిపిస్తూ వార్తల్లో నిలిచారు. షెహ్‌జాద్‌ రాజీనామాపై బీజేపీ గానీ, ఆయన గానీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Advertisement
Shehzad Poonawalla
BJP
Resignation
Narendra Modi
BJP National Spokesperson
Indian Politics

More Telugu News