ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం
- భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో ఈ ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. ప్రస్తుతం 9,74,666 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
వరద ఉద్ధృతికి కల్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలెవరూ గోదావరి వైపు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటిమట్టం 11.29 మీటర్లకు చేరి ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.