క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో ఘోరం

Bengaluru man kills 14 year old son with cricket bat
  • స్కూలుకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహం
  • మొబైల్ ఫోన్ రిపేర్ చేయించాలని అడగడంతో గొడవ
  • బ్యాట్ తో కొడుతూ కొడుకు తలను గోడకేసి కొట్టిన తండ్రి
  • తీవ్ర గాయాలతో కన్నుమూసిన పద్నాలుగేళ్ల కొడుకు
స్కూలుకు సరిగా వెళ్లడంలేదని అప్పటికే కోపంతో ఉన్న తండ్రికి మొబైల్ ఫోన్ రిపేర్ కోసం కొడుకు డబ్బులడగడం మరింత కోపం తెప్పించింది. చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను స్కూలుకు పంపిస్తుంటే, స్కూలుకు వెళ్లకుండా నువ్వు చేస్తున్నదేంటని అడుగుతూ కొట్టడం మొదలు పెట్టాడు. కోపంలో విచక్షణ మరిచిపోయి క్రికెట్ బ్యాట్ తో తీవ్రంగా కొట్టాడు. గోడకేసి కొట్టడంతో కొడుకు తల పగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆ పద్నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. బెంగళూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుందీ దారుణం.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాష్నినగర్ కు చెందిన రవికుమార్ (40) కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య శశికళ, కొడుకు తేజస్ (14) ఉన్నారు. తేజస్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే, క్లాసులకు సరిగా వెళ్లకుండా ఎప్పుడు చూసినా మొబైల్ తో ఆటలాడుతూ కనిపిస్తున్నాడని రవికుమార్ కొడుకును తిడుతుండేవాడు. తాము కష్టపడి చదివిస్తుంటే కొడుకు చదువును నిర్లక్ష్యం చేయడం తట్టుకోలేకపోయేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మొబైల్ ఫోన్ రిపేర్ కోసం డబ్బులు కావాలని అడిగిన తేజస్ పై రవికుమార్ తీవ్రంగా మండిపడ్డాడు.

ఇంట్లోని క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యపైనా మండిపడ్డాడు. అప్పటికీ కోపం తగ్గక ‘నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే’ అంటూ కొడుకు తలను గోడకేసి కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి తేజస్ స్పృహ కోల్పోయాడు. కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రవికుమార్ అడ్డుకున్నాడు. తేజస్ ను అలాగే వదిలేసి కాసేపటి తర్వాత బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికి లేవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో శశికళ తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అయితే, గాయాలు, రక్తస్రావం కారణంగా తేజస్ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చిన రవికుమార్.. కొడుకుది సాధారణ మరణమేనని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసి శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి రవికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Bengaluru
Father Son
Cricket Bat
Crime News
Murder
Beaten To Death

More Telugu News