నేటి నుండి ఏపీలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం .. గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- రేపు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా 99 అన్న క్యాంటీన్ల ప్రారంభం
- క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు
- క్యాంటీన్ల నిర్వహణకు నారా భువనేశ్వరి కోటి విరాళం
ఈరోజు సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తుండగా, రేపు (ఆగస్టు 16) 99 అన్న క్యాంటీన్ లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్ లలో మూడు పూటలా కలిపి రోజుకు 1.05 లక్షల మంది పేదలకు అహారం సరఫరా చేయనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం 35 వేల మందికి చొప్పున అందించనున్నారు. ఒకొక్కరి నుండి పూటకు రూ.5 ల వంతున నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. అన్న క్యాంటీన్ లకు ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ కు అప్పగించారు.
ఇక రెండు, మూడు విడతల్లో మరో 103 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా, సీఎం చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భారీ విరాళం అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు.