మీ అపాయింట్ మెంట్ ను ఈ పద్ధతిలో అడగాల్సి వచ్చిందన్న సునీతా కృష్ణన్... నో ప్రాబ్లమ్ అంటూ చంద్రబాబు రిప్లయ్

Chandrababu replies to Sunitha Krishnan tweet
  • చంద్రబాబును కలిసేందుకు సాధారణ మార్గాలు పనిచేయలేదన్న సునీతా
  • అందుకే సోషల్ మీడియా ద్వారా అపాయింట్ మెంట్ అడుగుతున్నానని వెల్లడి
  • మంగళవారం కలుద్దాం అంటూ సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు
సాధారణంగా పెద్ద పదవుల్లో ఉండే నేతలను కలవాలంటే, ముందుగా వారి సిబ్బందిని కలిసి అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. ఓ ట్వీట్ ద్వారా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. 

"చంద్రబాబు సర్... ఇలా సంప్రదాయ విరుద్ధ మార్గంలో మీ అపాయింట్ మెంట్ కోరుతున్నాను. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు. వచ్చే వారం నాకోసం 10 నిమిషాల విలువైన సమయాన్ని కేటాయించగలరా? రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసేందుకు గత కొన్ని రోజులుగా సాధారణ మార్గాల్లో ప్రయత్నించాను కానీ, ఆ ప్రయత్నాలు ఏమంత సఫలం కాలేదు. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా మీ అపాయింట్ మెంట్ అడుగుతున్నాను... క్షమించండి" అంటూ సునీతా కృష్ణన్ పేర్కొన్నారు. 

సునీతా కృష్ణన్... అమ్మాయిల అక్రమ రవాణా మాఫియాలకు ఎదురొడ్డి పోరాడి, వందల సంఖ్యలో అమ్మాయిలకు స్వేచ్ఛ ప్రసాదించారు. ప్రజ్వల ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం, ఉపాధి కల్పిస్తున్నారు. 

కాగా, సునీతా కృష్ణన్ ట్వీట్ పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. "నో ప్రాబ్లమ్ సునీత గారూ... మనం మంగళవారం కలుద్దాం. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అవుదాం. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. పాలనను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అంతేకాదు, మా అపాయింట్ మెంట్ వ్యవస్థలను మెరుగుపర్చడానికి ఏం చేయగలమో కూడా ఆలోచిస్తాం" అని చంద్రబాబు ఓ ట్వీట్ ద్వారా బదులిచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Sunitha Krishnan
Appointment
Andhra Pradesh

More Telugu News