త్వరలో ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ... యుద్ధం మొదలైన తరువాత తొలి పర్యటన!
- ఆగస్టులో మోదీ ఉక్రెయిన్ పర్యటన
- రష్యాతో యుద్ధం మొదలైన తరువాత తొలిసారిగా పర్యటించనున్న ప్రధాని
- పుతిన్‌తో సమావేశం నేపథ్యంలో ఉక్రెయిన్ పర్యటనకు ప్రాధాన్యం
అంతకుముందు ప్రధాని మోదీ ఎన్నికల విజయంపై శుభాకాంక్షలు తెలిపిన జెలెన్‌స్కీ తమ దేశంలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. మార్చిలో మోదీతో ఫోన్ కాల్ సందర్భంగా కూడా ఆయన ఇరు దేశాల దౌత్యబంధం బలోపేతం చేసే చర్యలపై చర్చించారు. చర్చలు, దౌత్యం ద్వారానే రష్యాతో యుద్ధానికి ముగింపు పలకాలని ఆకాంక్షించారు. సమస్యకు సామరస్య పరిష్కారం కోసం తాను చేయగలిగినంతా చేస్తానని మోదీ అప్పట్లోనే మాటిచ్చారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచీ ఈ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ చెబుతూ వస్తోంది. శాంతి స్థాపన కోసం తమవంతు బాధ్యత నిర్వర్తిస్తామని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం సందర్భంగా ప్రధాని ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు. యూనైటెడ్ నేషన్స్ చార్టర్‌ను, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాల్ని గౌరవించాలన్నదే భారత్ అభిమతమని చెప్పారు. చర్చలు, దౌత్యమే మన ముందున్న ఏకైక మార్గమని తేల్చి చెప్పారు.