Inzamam-ul-Haq: మ‌రోసారి భారత క్రికెట్, బీసీసీఐపై నోరుపారేసుకున్న ఇంజ‌మామ్‌!

Pakistan Legend Inzamam Slams BCCI Says Different Rules Exist For India In T20 World Cup 2024
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్‌ ఇంజమామ్-ఉల్-హక్ మ‌రోసారి భార‌త్‌పై నోరుపారేసుకున్నాడు. సూప‌ర్‌-8లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా బాల్‌టాంప‌రింగ్‌కు పాల్ప‌డింద‌ని, అందుకే బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవ‌ర్‌లో రివ‌ర్స్‌స్వింగ్ రాబ‌ట్ట‌గ‌లిగాడ‌ని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్, బీసీసీఐ, 2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై విమ‌ర్శ‌లు గుప్పించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్‌కు ప్ర‌త్యేక‌మైన‌ నిబంధనలు ఉన్నాయన్నాడు. 

టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియా సెమీ ఫైనల్ వేదికను ముందే నిర్ణయించింద‌న్న ఇంజ‌మామ్‌.. ఇది అన్యాయమని పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఎప్పుడూ అలాంటి ప్రయోజనాలను పొందలేదని చెప్పుకొచ్చాడు. భారత్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోవడం కూడా భారత్‌కు అనుకూలంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఇంజమామ్ తెలిపాడు.

పాకిస్థాన్ 24 న్యూస్ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే హంగామా షోలో కనిపించిన ఇంజమామ్ ఇలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. "మీరు రెండు సెమీ ఫైనల్‌లను గ‌మ‌నిస్తే, భారత్-ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే లేదు. ఎందుకంటే టీమిండియా వారి గ్రూప్ ద‌శ‌లో అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఒక‌వేళ సెమీస్ ర‌ద్దు అయితే వారు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు" అని అన్నాడు. 

ఒక్కో మ్యాచ్‌కి వేర్వేరు నియమాలు ఉన్నాయ‌ని తెలిపాడు. "పాకిస్థాన్ ఆసియా కప్‌లో బలమైన స్థితిలో ఉన్నప్పుడు, మాకు ఉన్న‌ట్టుండి కేవలం ఒక మ్యాచ్ కోసం రిజర్వ్ డే వచ్చింది" అని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కూడా ఏమీ చేయలేనంత ఉన్న‌త‌స్థాయిలో భారత్‌ ఉంది. క్రికెట్‌ను కేవలం ఒక శక్తి మాత్రమే నడుపుతోంద‌ని బీసీసీఐని ఉద్దేశించి ఇంజమామ్ అన్నాడు.

ఇంజమామ్ వ్యాఖ్యలపై షో యాంకర్ స్పందిస్తూ.. బీసీసీఐకి ఉన్న ఆర్థిక బ‌లం ఒక కారణమన్నారు. అయితే, క్రికెట్‌లో ఇలా అన్యాయ‌మైన‌ మార్గంలో త‌మ‌కు ఫేవ‌ర్‌గా నిర్ణ‌యాల‌ను మార్చుకోవ‌డం మంచిది కాద‌ని హితువు ప‌లికారు.

ఇక సూప‌ర్‌-8లో ఆసీస్‌తో మ్యాచ్‌లో 15వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ రివర్స్ స్వింగ్‌ని రాబ‌ట్ట‌డంపై భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి ఉండవచ్చని ఇంజమామ్ అనుమానం వ్య‌క్తం చేశాడు. ఆయ‌న ఆరోపణలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా ఖండించాడు. ఇంజమామ్ విషయాలను ఓపెన్ మైండ్‌తో చూడాలని సూచించాడు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ క‌రెక్టుగా అర్థమ‌వుతాయ‌న్నాడు.
Go Back to Shorts
Inzamam-ul-Haq
Pakistan
BCCI
Team India
T20 World Cup 2024
Cricket
Sports News

More Telugu News