జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చిన రైల్వే శాఖ
- విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఆధునికీకరణ పనులు
- జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్ల రద్దు
- ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున ఆందోళనలు
- జన్మభూమి, తదితర రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన
నిడదవోలు-కడియం సెక్షన్ లో ఆధునికీకరణ పనుల నేపథ్యంలో... జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుండడంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 25 నుంచి మామూలుగానే నడపాలని తాజాగా నిర్ణయించింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ తో పాటు విజయవాడ-కాకినాడ పోర్టు, చెంగల్పట్టు-కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.