ఉత్తర, దక్షిణ దేశం అంటూ విభజించే కుట్రలను సహించేది లేదు: ప్రధాని మోదీ హెచ్చరిక
- కొంతమంది మా రాష్ట్రం మా పన్నులు అని మాట్లాడుతున్నారు... ఇదే వితండవాదమని ఆగ్రహం
- నది మా రాష్ట్రంలో ప్రవహిస్తోంది కాబట్టి మాకే... బొగ్గు మా వద్దనే ఉన్నది కాబట్టి మేమే వాడుకుంటామంటే ఎలా? అని ప్రశ్న
- వికసిత్ భారత్ కోసం మోదీ 3.0 అవసరమన్న ప్రధాని
- ఇండియా అంటే ఢిల్లీ మాత్రమే కాదు... చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా అన్న మోదీ
ఉత్తరాది... దక్షిణాది అంటూ నిధుల పంపిణీపై కొంతమంది నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో ఎలాంటి సంకుచితతత్త్వం లేదని... పారదర్శకంగా ఉంటామన్నారు. రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. అన్ని ప్రాంతాలను తాము సమానంగా చూస్తామన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కాస్త ఎక్కువ నిధులు అవసరమవుతాయని గుర్తించాలని హితవు పలికారు. నది మా రాష్ట్రంలో ప్రవహిస్తోంది కాబట్టి మాకే... బొగ్గు మా వద్దనే ఉన్నది కాబట్టి మేమే వాడుకుంటాం... మా రాష్ట్రం మా పన్నులు... ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించారు.
ఇండియా అంటే ఢిల్లీ మాత్రమే కాదు... చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా
ఇండియా అంటే ఢిల్లీ ఒక్కటే కాదని ప్రధాని మోదీ అన్నారు. నా దేశం అంటే ఢిల్లీ మాత్రమే కాదు... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా అన్నారు. దేశం అంటే మట్టి కాదని... మన ఐక్యతకు చిహ్నమని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్రాలు ఒక్క అడుగు వేస్తే తాము రెండు అడుగులు వేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఓడినా మనం మాత్రమే గెలిచామని గర్వంగా చెప్పారు. కరోనా సమయంలో తాను ముఖ్యమంత్రులతో 20సార్లు సమావేశమయ్యానని గుర్తు చేశారు.
యువరాజు స్టార్టప్ నాన్ స్టార్టప్‌గా మిగిలింది
యువరాజు స్టార్టప్ నాన్ స్టార్టప్‌గా మిగిలిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఇప్పటికీ విజయవంతంగా లాంచ్ చేయలేకపోయారని చురక అంటించారు. యూపీఏ హయాంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కేంద్రమంత్రులను కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేశారని ధ్వజమత్తారు.