జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల విడుదల.. టాపర్‌గా హైదరాబాదీ విద్యార్థి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల విడుదల.. టాపర్‌గా హైదరాబాదీ విద్యార్థి

Jee main session 2 results out hyderabad student emerges as topper
  • అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులు
  • మెయిన్స్ టాపర్‌గా నిలిచిన హైదరాబాద్ విద్యార్థి వెంకట్ కౌండిన్య
  • జూన్ 4న అడ్వాన్స్‌డ్ పరీక్ష, 18న ఫలితాల విడుదల
జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్ష  ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ రెండవ సెషన్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన బెస్ట్ స్కోర్ (రెండు సార్లు రాస్తే..) ఆధారంగా ఎన్‌టీఏ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. ఈ మారు మొత్తం 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. 

 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య 300/300 స్కోర్‌తో మెయిన్ టాపర్‌గా నిలిచాడు. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి మార్కులు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనేదే తన లక్ష్యమని చెప్పాడు. నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్య సాయి 2వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి 6వ ర్యాంకు దక్కించుకున్నాడు. అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంత 10వ ర్యాంకు సాధించాడు.  మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి పరీక్షకు ఏప్రిల్ 30 నుంచి మే 7లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుండగా ఫలితాలను అదే నెల 18న విడుదల చేస్తారు.
Advertisement
IIT Jee Main

More Telugu News