శ్రీలంకలో లీటర్ పెట్రోల్ రూ.550, డీజిల్ రూ.460.. మరింత ముదురుతున్న ఆర్థిక సంక్షోభం
- పెట్రోల్ కొరత, ధరల పెంపుపై ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ
- బంకుల ముందు క్యూ కట్టొద్దని విజ్ఞప్తి
- ఆర్థిక సాయం అందించేందుకు అమెరికా బృందం వచ్చిన సమయంలో ధరల పెంపు
చమురు అందే పరిస్థితి లేక..
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు డబ్బులు చెల్లించలేకపోతోంది. భారత్ సహా వివిధ దేశాలు అందిస్తున్న రుణాలు, ఆర్థిక సాయంతో గడుపుతోంది. కొద్దికొద్దిగా చమురు దిగుమతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజా దిగుమతులు ఆలస్యం అవుతుండటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని శ్రీలంక చమురు మంత్రిత్వ శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. ధరలు పెంచడం, కొరతపై ప్రజలకు క్షమాపణ చెప్పారు. వాహనదారులెవరూ బంకుల ముందు క్యూలు కట్ట వద్దని విజ్ఞప్తి చేశారు.
శ్రీలంక తగిన సాయం చేస్తామన్న అమెరికా
ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు అమెరికా ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ‘‘శ్రీలంక చరిత్రలోనే దారుణమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశానికి ఏమేం అవసరమో, ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందనే అంశాలను అమెరికా బృందం పరిశీలిస్తోంది. ఆర్థిక వృద్ధికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి తగిన సాయం అందించడంపై దృష్టి పెడుతున్నాం” అని శ్రీలంక రాజధాని కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇటు అమెరికా బృందం పర్యటిస్తున్న సమయంలోనే అటు శ్రీలంక ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం గమనార్హం.