మహిళల్లోనే కరోనా ప్రతిరక్షకాలు ఎక్కువ: ముంబై సీరో సర్వేలో వెల్లడి
- 37.12% మందికి యాంటీబాడీలు
- అదే పురుషుల్లో అయితే కేవలం 35%
- మురికివాడల్లో 41% మందికి ప్రతిరక్షకాలు
- క్లాస్ ఏరియాల్లోని ప్రజల్లో 28.5% మందికి
సీరో సర్వేలో 37.12 శాతం మంది మహిళలకు యాంటీ బాడీలున్నట్టు తేలగా.. పురుషుల విషయంలో అది 35.02 శాతంగా ఉందని వెల్లడించింది. మురికివాడల్లోని 41.61 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలున్నాయని పేర్కొంది. మొత్తంగా ముంబైలోని 24 వార్డులకు సంబంధించి 10,197 నమూనాలను పరీక్షించగా 36.3 శాతం మందిలో ప్రతిరక్షకాలున్నాయని ప్రకటించింది. కాగా, ప్రైవేట్ ల్యాబ్ ల నుంచి క్లాస్ ప్రాంతాలకు చెందినవారి శాంపిళ్లను టెస్ట్ చేయగా 28.5 శాతం మందిలో యాంటీ బాడీలున్నట్టు తేలిందని తెలిపింది.
మార్చిలో నమూనాలు సేకరించామని, వాటిని బీఎంసీ మాలిక్యులార్ బయాలజీ లేబొరేటరీ, కస్తూర్బా ఆసుపత్రి పరిసరాల్లో పరీక్షించామని ఓ అధికారి చెప్పారు. గత ఏడాది జూలైలో చేసిన సర్వేలో మూడు వార్డుల్లోని మురికివాడల్లో 57 శాతం మందికి ప్రతిరక్షకాలున్నట్టు తేలిందని, ఆగస్టులో 45 శాతంగా నిర్ధారణ అయిందని చెప్పారు.