అవినీతికి చంద్రబాబు అన్న అయితే, సబ్బం హరి తమ్ముడు: గుడివాడ అమర్నాథ్
- వివాదాస్పదంగా మారిన సబ్బం హరి ప్రహరీగోడ కూల్చివేత
- సబ్బం హరి పార్కు స్థలాన్ని ఆక్రమించారన్న అమర్నాథ్
- సబ్బం ఆస్తులు ప్రజలకు తెలుసని వ్యాఖ్యలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవినీతికి అన్న అయితే, సబ్బం హరి తమ్ముడని అమర్నాథ్ విమర్శించారు. అవినీతిలో పెద్ద నేతలకు టీడీపీలో ఉన్నత పదవులు లభిస్తాయని అన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు పార్టీ పదవులు ఇవ్వడం చంద్రబాబు నీతికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ టీడీపీ నేత సబ్బం హరికి గట్టి హెచ్చరికలు చేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిల గురించి మాట్లాడే అర్హత సబ్బం హరికి ఉందా అని ప్రశ్నించారు. సబ్బం హరి మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. ఇలాగే నోటికొచ్చినట్టు మాట్లాడితే సీఎం జగన్ సైనికుడిలా వెళ్లి సబ్బం హరి నాలుక కోస్తానని అన్నారు.