భారత్ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. నష్టనివారణ చర్యలకు దిగిన అగ్రదేశం!
- మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్
- ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ భారత్ ఆగ్రహం
- ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకుంటేనే చర్చలు సాధ్యపడతాయన్న అమెరికా
కశ్మీర్ అంశం ఇండియా, పాకిస్థాన్ లకు చెందినదని... ఆ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టెర్రరిజంపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకుంటేనే... భారత్ తో చర్చలు సాధ్యపడతాయని వెల్లడించింది. భారత్-పాక్ లు కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చేసే యత్నాలకు ట్రంప్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.
అమెరికా విదేశాంగ శాఖకు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటేనే... భారత్ తో ద్వైపాక్షిక చర్చలు విజయవంతమవుతాయని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ చిత్తశుద్ధిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో తమ సహకారం ఉంటుందని తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.