సాధారణంగా గుడిలో దేవుడికి నైవేద్యంగా ఘన ఆహార పదార్థాలను పెడుతుంటారు. అయితే, తమిళనాడులోని ఓ గుడిలో నైవేద్యంగా మద్యాన్ని పెడుతున్నారు. నైవేద్యమే కాదు, భక్తులకు తీర్థంగానూ మద్యాన్ని ఇస్తున్నారు. దీనిపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. తేని జిల్లాలోని కుచ్చనూర్ శనీశ్వర్ ఆలయంలో ఉన్న సోనైకురుప్పన్నస్వామి ఆలయంలో భగవంతుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఆషాఢ మాసంలోని శనివారాల్లో నిర్వహించే ప్రత్యేక వేడుకలప్పుడు ఈ దేవాలయంలో మద్యం ఏరులైపారుతుంది. ఈ దేవాలయానికి మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులు భగవంతుడికి మద్యం బాటిళ్లను సమర్పిస్తారు. ఈ మద్యాన్నే ఆలయ పూజారులు భక్తులకు తీర్థంగా అందజేస్తారు. ఈ సంప్రదాయంపై తమిళనాడులో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల భక్తులు మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు మండిపడుతున్నారు. బాలలకు కూడా మద్యాన్నే తీర్థంగా ఇవ్వడం వల్ల వారు మద్యానికి అలవాటుపడే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.