ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా?: కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం
- జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్న డీకే అరుణ
- జలాశయంలో ప్రస్తుతం సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడి
- రైతులు చేపట్టిన ఆందోళనలకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టీకరణ
పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి నీటి కోసం రైతాంగం అల్లాడుతుంటే, రాబోయే ఎండాకాలాన్ని బూచిగా చూపి కాలువలకు నీటిని నిలిపివేయడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. జూరాల జలాశయంలో ప్రస్తుతం సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, కృష్ణా నదికి ఇంకా వరద వచ్చే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు.
ఒకవేళ వేసవిలో తాగునీటి ఎద్దడి వచ్చినా, ఎగువన కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అక్కడి నుంచి నీటిని తెప్పించుకునేందుకు చొరవ చూపవచ్చని డీకే అరుణ సూచించారు. జూరాల డ్యాం రోడ్డు, కలెక్టరేట్ ఎదుట రైతులు చేపట్టిన ఆందోళనలకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, రైతుల పోరాటానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నీటి కొరత తీవ్రతను వివరిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. సాగు చేసిన పంటలు చేతికందేలా కాలువలకు నీరు విడుదల చేయాలని కోరడంతో పాటు, అందుబాటులో ఉన్న నీటిని రైతులు కూడా పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.