రూ. 279 బిల్లుకు రూ. 2000 టిప్: భారీ వర్షంలో సాయపడిన క్యాబ్ డ్రైవర్‌కు ప్రయాణికుడి నజరానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 279 బిల్లుకు రూ. 2000 టిప్: భారీ వర్షంలో సాయపడిన క్యాబ్ డ్రైవర్‌కు ప్రయాణికుడి నజరానా

Passenger gives 2000 tip for 279 bill to cab driver who helped in heavy rain
  • భారీ వర్షంలోనూ రైడ్ క్యాన్సిల్ చేయని క్యాబ్ డ్రైవర్
  • తల్లితో ఉన్నందున సాయం కోరిన ప్రయాణికుడు
  • గంట ప్రయాణం తర్వాత రూ. 279 బిల్లుకు రూ. 2000 టిప్
  • డ్రైవర్, ప్రయాణికుడిపై నెటిజన్ల ప్రశంసల వర్షం
భారీ వర్షంలోనూ రైడ్ రద్దు చేయకుండా, ఎంతో ఓపికతో గమ్యస్థానానికి చేర్చిన ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు ప్రశంసల జల్లు కురిపించాడు. డ్రైవర్ మంచితనానికి ముగ్ధుడైన ఆయన, రూ. 279 బిల్లుకు గానూ ఏకంగా రూ. 2,000లను టిప్‌గా ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, ఒక వ్యక్తి తన వృద్ధురాలైన తల్లితో కలిసి ప్రయాణించేందుకు భారీ వర్షం పడుతున్న సమయంలో ఉబెర్ క్యాబ్ బుక్ చేశాడు. తన వెంట వయసు మళ్లిన తల్లి ఉన్నందున, రైడ్‌ను క్యాన్సిల్ చేయవద్దని డ్రైవర్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించాడు. సాధారణంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలామంది డ్రైవర్లు రైడ్‌ను రద్దు చేసుకుంటారు. కానీ, సురేశ్ అనే డ్రైవర్ మాత్రం ప్రయాణికుడి విన్నపాన్ని మన్నించి, పిక్-అప్ లొకేషన్‌ కోసం వెతుకుతూ అక్కడికి చేరుకున్నాడు.

సరైన లొకేషన్‌ను గుర్తించేందుకే డ్రైవర్ సుమారు 20 నిమిషాల పాటు ఫోన్‌లో సంప్రదించాడని ఆ ప్రయాణికుడు తన 'ఎక్స్' పోస్ట్‌లో పేర్కొన్నాడు. కారు బానెట్ వరకు నీరు చేరిన రోడ్లపై కూడా ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో డ్రైవ్ చేశాడని తెలిపాడు. కేవలం 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పట్టినా, సురేశ్ ఎక్కడా అసహనం ప్రదర్శించకుండా వారిని సురక్షితంగా ఇంటి వద్ద దించాడని వివరించాడు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో, క్యాబ్ డ్రైవర్ సురేశ్‌తో పాటు ఉదారత చాటుకున్న ప్రయాణికుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "డ్రైవర్ అంకితభావం అద్భుతం.. అతనికి అంత పెద్ద మొత్తాన్ని టిప్‌గా ఇచ్చిన మీరు కూడా అభినందనయులు" అని ఒకరు కామెంట్ చేయగా, గతంలో తాము కూడా ఇటువంటి పరిస్థితుల్లో డ్రైవర్లకు అదనంగా నగదు చెల్లించామని మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కష్టకాలంలో డ్రైవర్ చూపిన సేవాభావం, దానికి ప్రయాణికుడు చూపిన కృతజ్ఞత నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
Advertisement
Cab Driver Suresh
Uber Cab
Heavy Rain
Viral Social Media Story
Generous Tip
Passenger Gratitude

More Telugu News