నెయిల్‌ ఆర్ట్‌తో నెలకు రూ.10 లక్షలు.. దుబాయ్‌లో సొంత సెలూన్‌ తెరిచిన యువతి

Young woman earns 10 lakh per month with nail art and opens own salon in Dubai
  • నెయిల్‌ ఆర్ట్‌ నైపుణ్యంతో నెలకు రూ.10 లక్షల సంపాదన
  • వియత్నాంకు చెందిన నుయెన్‌ ఫుయాంగ్‌ ఆన్‌ సక్సెస్‌ స్టోరీ
  • చిన్న ఉద్యోగంతో మొదలై దుబాయ్‌లో సొంత సెలూన్‌
  • త్రీడీ నెయిల్‌ డిజైన్లతో ఆమెకు భారీ  ఆదాయం
  • 50 ఏళ్లకే రిటైర్‌ కావాలనేది ఆమె లక్ష్యం
అందంగా వేసిన నెయిల్‌ పాలిష్‌ కూడా లక్షల ఆదాయం తెచ్చిపెడుతుందా? చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఓ యువతి తన నెయిల్‌ ఆర్ట్‌ నైపుణ్యాన్నే వ్యాపారంగా మార్చుకుని నెలకు రూ.10 లక్షల వరకు సంపాదిస్తోంది. ఇప్పుడు దుబాయ్‌లో సొంత సెలూన్‌ నడుపుతూ 50 ఏళ్లకే రిటైర్‌ కావాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది.

వియత్నాంకు చెందిన నుయెన్‌ ఫుయాంగ్‌ ఆన్‌ ‘ఫుల్లా’ పేరుతో ప్రసిద్ధి చెందింది. 12 ఏళ్ల క్రితం నెయిల్‌ ఆర్ట్‌ను వృత్తిగా ఎంచుకుంది. పూలు, జంతువులు, త్రీడీ డిజైన్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆరు సంవత్సరాల క్రితం దుబాయ్‌కు వెళ్లి చిన్న సెలూన్‌లో ఉద్యోగం ప్రారంభించింది.

ప్రారంభంలో ఆమెకు నెలకు 3,500 దిర్హామ్‌ల జీతమే వచ్చేది. రెండేళ్ల తర్వాత ఫ్రీలాన్స్‌ నెయిల్‌ ఆర్టిస్ట్‌గా మారింది. రోజూ కష్టపడి పనిచేస్తూ పెద్ద సంఖ్యలో ఖాతాదారులను సంపాదించింది. దీంతో ఆమె నెలవారీ ఆదాయం 30 వేల నుంచి 40 వేల దిర్హామ్‌లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

ఈ ఏడాది జూన్‌లో దుబాయ్‌లోని జుమైరా విలేజ్‌ సర్కిల్‌లో ‘బ్యూటీ బై ఫుల్లా’ పేరుతో సొంత సెలూన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. భవిష్యత్తులో అబుదాబి, ఫుజైరా వంటి ప్రాంతాల్లో మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆదాయం ఎక్కువైనా ఆమె జీవనశైలి మాత్రం చాలా సాధారణం. చాలా పరిమితంగా ఖర్చు చేస్తోంది. మిగిలిన డబ్బును వియత్నాంలో పెట్టుబడులుగా పెడుతోంది. ఇప్పటికే అక్కడ రెండు ఇళ్లు కొనుగోలు చేసింది. మరిన్ని ఆస్తులు కూడబెట్టాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది.

మరో 20 ఏళ్లలో అంటే 50 ఏళ్ల వయసులోనే ఉద్యోగ జీవితానికి గుడ్‌బై చెప్పాలనేది ఆమె కల. అప్పటికల్లా ఓ ఫామ్‌హౌస్‌లో ప్రకృతి మధ్య జీవిస్తూ, జంతువులను పెంచుకుంటూ, కూరగాయలు పండించుకోవాలని భావిస్తోంది. ప్రతిభ, క్రమశిక్షణ, సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే చిన్న నైపుణ్యం కూడా గొప్ప విజయానికి పునాది అవుతుందని ఫుల్లా కథ చెబుతోంది.
Advertisement
Nguyen Phuong Anh
Dubai Nail Art Salon
Beauty by Fulla
Nail Artist Success Story
Dubai Entrepreneur Income
High Earning Beauty Business

More Telugu News