Advertisement

మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి

Musi Riverfront project gets Center approval Revanth Reddy expresses gratitude
  • రక్షణ శాఖ భూములు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి
  • 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం
  • వేగవంతం కానున్న మూసీ ఫేజ్-1 పనులు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు వీలుగా కేంద్రం పని అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ అనుమతుల ప్రకారం... ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని సుమారు రూ. 533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల రక్షణ శాఖ భూమిని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవడానికి కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. లీగల్, డిఫెన్స్ నిబంధనల ప్రకారం ఇరు ప్రభుత్వాల మధ్య జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియకు కేంద్ర రక్షణ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీంతో బాపూఘాట్ పరిసరాల్లో ప్రతిపాదిత అంతర్జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు, పర్యాటక హంగుల నిర్మాణానికి ఉన్న ప్రధాన లీగల్ అడ్డంకులు తొలగిపోయాయి.


మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. "మూసీ పునరుజ్జీవం, రివర్‌ ఫ్రంట్ అభివృద్ధికి సంబంధించి మా ప్రభుత్వం పెట్టుకున్న సుదూర లక్ష్యాలు సాధించడంలో ఇదో చారిత్రాత్మక మైలురాయి. మూసీ పరివాహక ప్రాంతాన్ని కేవలం కాంక్రీట్ కట్టడాలుగా కాకుండా.. పర్యావరణ, సాంస్కృతిక, అద్భుతమైన ప్రజా ఆస్తిగా మార్చడమే మా ప్రభుత్వ ప్రధాన సంకల్పం" అని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన క్లియరెన్స్‌తో మూసీ ఫేజ్-1 పనులు మరింత వేగవంతం కానున్నాయి.

Advertisement
Revanth Reddy
Musi Riverfront Development
Gandhi Sarovar Project
Bapu Ghat Hyderabad
Defense Land Transfer Telangana
Rajnath Singh

More Telugu News