కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య
- లాంఛనంగా ప్రారంభమైన నాగచైతన్య 'దూత 2' వెబ్ సిరీస్
- ఈ సిరీస్‌తో తొలిసారి నిర్మాతగా మారిన హీరో నాగచైతన్య
- హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు
- ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున
- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న సస్పెన్స్ థ్రిల్లర్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. తొలి షాట్‌కు ఆయనే క్లాప్ కొట్టి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సిరీస్‌తో తాను నిర్మాతగా మారుతున్న విషయాన్ని నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. "దూత రెండో అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో పాటు నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను. ఈ శుభారంభం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముందుకు సాగడమే. అద్భుతాలు జరగబోతున్నాయి" అంటూ పూజా కార్యక్రమాల ఫొటోలను పంచుకున్నారు.
హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా ఈవెంట్ ఫొటోలను షేర్ చేస్తూ.. "మళ్లీ అదే టీమ్‌తో కలిశాం. ఈ కార్యక్రమానికి హాజరై మాలో మరింత ఉత్సాహం నింపిన నాగార్జున గారికి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో నాగచైతన్యతో పాటు పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతంలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన 'దూత' మొదటి భాగానికి విశేషమైన స్పందన లభించింది. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే అంచనా వేస్తున్న న్యూస్‌పేపర్ల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య నటన అందరినీ ఆకట్టుకుంది. హత్య కేసులో ఇరుక్కున్న అతను, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం ఉత్కంఠభరితంగా సాగింది. శరత్ మరార్ నిర్మించిన తొలి భాగానికి కొనసాగింపుగా వస్తున్న ఈ రెండో భాగానికి నాగచైతన్య కూడా నిర్మాతగా చేరడం విశేషం.