ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు... 'పెద్ది' సక్సెస్ మీట్‌లా ఉంది: విజయవాడలో రామ్ చరణ్
- విజయవాడలో అట్టహాసంగా జరిగిన 'పెద్ది' ప్రీ రిలీజ్ వేడుక
- పదేళ్లకొకసారి వచ్చే కథ 'పెద్ది' అని రామ్ చరణ్ అభివర్ణన
- అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నా, అవసరమైతే రక్తం చిందిస్తా అన్న చరణ్
- దర్శకుడు బుచ్చిబాబు భవిష్యత్తులో దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా నిలుస్తారని జోస్యం
- హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ప్రశంసలు, శ్రీదేవి కంటే పెద్ద స్టార్ అవ్వాలని ఆకాంక్ష
- సినిమా కమర్షియల్ కాదు, ఎమోషనల్ డ్రామా అని స్పష్టం చేసిన బుచ్చిబాబు
విజయవాడలో ఈ వేడుక ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా కాకుండా, సక్సెస్ మీట్‌లా ఉందని చరణ్ వ్యాఖ్యానించారు. అభిమానుల ఉత్సాహం, ప్రేమ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. "విజయవాడ మాకు అదృష్ట నగరం. నాన్నగారి పలు చిత్రాల బ్లాక్బస్టర్ల వేడుకలు ఇక్కడే జరిగాయి. ఆ సెంటిమెంట్‌ను, లక్‌ను మాతో తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం" అని చరణ్ పేర్కొన్నారు. ఇంత వేడిలోనూ గంటల తరబడి ఎదురుచూసిన అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
'పెద్ది' కథ గురించి మాట్లాడుతూ, "ఒక నటుడిగా ఎన్నో కథలు వింటాం. కొన్ని నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు నా గుండెకు హత్తుకుపోయింది. ఇది పదేళ్లకొకసారి వచ్చే అద్భుతమైన కథ. ఈ కథ నా సినీ ప్రయాణంలో దొరికినందుకు దర్శకుడు బుచ్చిబాబు గురువుగారైన సుకుమార్ గారికి కృతజ్ఞతలు. నా సినిమా లైబ్రరీలో ఇది చిరకాలం నిలిచిపోయే చిత్రమవుతుంది" అని అన్నారు.
ఇది ఎగిసిపడే మనిషి కథ కాదని, కింద పడిపోయిన వాడు తిరిగి ఎలా లేచి నిలబడ్డాడో చెప్పే కథ అని వివరించారు. ఈ సినిమా కోసం కష్టపడలేదని, ఎంతో ఇష్టంగా, ప్రేమతో పనిచేశామని స్పష్టం చేశారు. "మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్లీ ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు షూటింగ్‌కు వెళ్లాలా అనిపించిన సినిమా 'పెద్ది'" అని చరణ్ తెలిపారు.
దర్శకుడు బుచ్చిబాబుపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. "బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. అతని ఆలోచనా విధానం అద్భుతం. రాసిపెట్టుకోండి, భవిష్యత్తులో ఇండియాలోని టాప్-3, టాప్-4 డైరెక్టర్లలో బుచ్చిబాబు పేరు కచ్చితంగా ఉంటుంది," అని జోస్యం చెప్పారు. అభిమానుల ప్రోత్సాహం, అండ లేకపోతే ఇంత కష్టమైన సినిమాలు చేసేవాళ్లం కాదని అన్నారు.
"మీకోసమే ఈ సినిమాలు. చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, అవసరమైతే రక్తం చిందించైనా మిమ్మల్ని అలరిస్తాను. చిరంజీవి గారికి కొడుకుగా, కల్యాణ్ బాబాయ్‌కి అబ్బాయిగా పుట్టిన నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఇది రాసి పెట్టుకోండి" అంటూ అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వేదిక దద్దరిల్లింది.
ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌ను 'పెద్ది' చిత్రానికి అతిపెద్ద స్తంభం అని అభివర్ణించారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, ఎడిటర్ నవీన్ నూలీల పనితనాన్ని కొనియాడారు. నిర్మాత సతీష్ కిలారు గురించి మాట్లాడుతూ, "ఆయన తొలి సినిమా నిర్మాతలా కాకుండా 50 సినిమాలు తీసిన అనుభవజ్ఞుడిలా పనిచేశారు. కొందరు నిర్మాతల మాదిరిగా టీ తాగి వెళ్లిపోకుండా, ప్రతిరోజూ సెట్లో మాతోనే గడిపారు. మాకు వెన్నంటే నిలిచారు," అని ప్రశంసించారు.
హీరోయిన్ జాన్వీ కపూర్‌పై మాట్లాడుతూ, "చంద్రుడిలో ముక్క జారి నా పక్కన పడినట్టుంది. జాన్వీని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వపడతారు. ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉంది. తన తల్లి కంటే పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు. చివరగా సినిమాలోని డైలాగ్‌ను గుర్తుచేస్తూ, "పెద్దిగాడు ఆట ఆడలేదు, పోరాడాడు. ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని దుర్గమ్మ తల్లి సాక్షిగా మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను" అని ముగించారు. అభిమానులందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని సూచించారు.
చరణ్ నటనకు కన్నీళ్లు వస్తాయి: దర్శకుడు బుచ్చిబాబు
ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సినిమా గురించి, తన ప్రయాణం గురించి ఆయన పంచుకున్న విషయాలు వేడుకకే హైలైట్‌గా నిలిచాయి.
ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ, "ఉప్పెన తర్వాత ఐదేళ్లకు ఈ సినిమా చేస్తున్నా. చాలా టెన్షన్‌గా, నెర్వస్‌గా ఉంది. చేతులు, కాళ్లు వణుకుతున్నాయి. 'పెద్ది' కేవలం కమర్షియల్ సినిమా కాదు. ఇది ఓ ఆటగాడి ఎమోషనల్ డ్రామా. ఆట ఒక మనిషికి గుర్తింపు, గౌరవం ఎలా తెచ్చిపెడుతుందో చెప్పే కథ. 'పెద్ది' అంటే అలలా ఎగసిపడిన వాడు కాదు, పడినా తిరిగి లేచిన మనిషి కథ" అని సినిమా ఆత్మను ఆవిష్కరించారు.
రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, "నా గురువు సుకుమార్ గారు నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పగానే ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేశారు. రెండో సినిమాకే ఒక దర్శకుడిని నమ్మి, ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం మామూలు విషయం కాదు. ఒక నిజాయితీ గల కథను, నిజాయతీ ఉన్న హీరో నమ్మి చేస్తే ఎలా ఉంటుందో 'పెద్ది' చూపిస్తుంది. సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు చరణ్ గారి నటన చూసి కన్నీళ్లు రాకుండా ఉండవు. పదేళ్ల తర్వాత ఈ సినిమాను ఎలా గుర్తుంచుకుంటారని అడిగితే, నా సమాధానం 'రామ్‌చరణ్'" అని అన్నారు.
తనకు విజయవాడతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, "ఉప్పెన కథ సైకిల్ తొక్కుకుంటూ ఇక్కడే రాసుకున్నాను. నేను తండ్రిని కాబోతున్నానని తెలిసింది కూడా ఇక్కడే. దుర్గమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి" అని పేర్కొన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాకు కొత్త రంగు అద్దారని, ఆమె నటనలో హీరోయిజం కనిపిస్తుందని కొనియాడారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పనిచేయడం తన చిరకాల కోరిక అని, అది ఈ చిత్రంతో నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర కూడా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందని భరోసా ఇచ్చారు. జూన్ 4న కుటుంబసమేతంగా థియేటర్లకు వచ్చి, పట్టుదలతో విజయం సాధించిన 'పెద్ది' ప్రయాణాన్ని చూడాలని ఆయన కోరారు.