అద్భుతమైన విషయాన్ని కనిపెట్టిన చంద్రయాన్ ల్యాండర్.. సీక్రెట్‌గా ఉంచిన ఇస్రో!
- మిషన్ చివర్లో అరమీటర్ పైకి లేచిన ల్యాండర్
- రాకెట్ మంటల ధాటికి కొట్టుకుపోయిన చందమామ పైపొర
- బయటకు లోపల దాగున్న గట్టి నేల
- చంద్రుడిపై నేల పొరలుగా ఉందని అంచనా
- మూన్ బేస్ నిర్మాణానికి ఈ డేటా కీలకం
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ముగిసినా సరికొత్త అద్భుతాలను బయటపెడుతూనే ఉంది. ‘శివశక్తి పాయింట్’ వద్ద విక్రమ్ ల్యాండర్ చేసిన ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. జాబిల్లి నేల గురించి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా సైతం అబ్బురపడే విషయాలు ఇస్రో ద్వారా వెలుగులోకి వచ్చాయి.
అనుకోకుండా చిన్న జంప్
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ తన ప్రయోగాలు పూర్తి చేసుకునే సమయానికి దానిలో కొంత ఇంధనం మిగిలింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా ప్లాన్ చేయని ఒక సాహసం చేశారు. ఇంజిన్లను మళ్లీ మండించి విక్రమ్‌ను చంద్రుడి ఉపరితలం నుంచి 50 సెంటీమీటర్ల పైకి లేపి పక్కకు కాస్త దూరంలో ల్యాండ్ అయ్యేలా చేశారు. టెక్నాలజీ పరంగా ఇది భారత్‌కు ఒక పెద్ద విజయమైనా సైంటిఫిక్‌గా అంతకంటే పెద్ద రహస్యం దీనివల్ల బయటపడింది.
కొట్టుకుపోయిన పైపొర
ల్యాండర్ ఇంజిన్లు మళ్లీ మండటంతో ఆ మంటల ధాటికి చంద్రుడిపై ఉన్న 3 సెంటీమీటర్ల పైపొర గాల్లోకి లేచింది. పైన ఎంతో మెత్తగా, దూదిలా ఉండే పొడి మట్టి తొలగిపోవడంతో.. దాని కింద ఎప్పుడూ ఎండ తగలని సరికొత్త మట్టి పొరలు ల్యాండర్‌లోని చాస్టే పరికరానికి చిక్కాయి. ఇలా ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్ లేకుండానే చంద్రుడి అంతర్భాగంలో ఉన్న మట్టిని పరిశీలించే అరుదైన అవకాశం శాస్త్రవేత్తలకు దొరికింది.
చందమామ నేల ‘కేక్’ లాంటిది
ఈ ప్రయోగం ద్వారా వచ్చిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం ‘కేక్’లా పొరలు పొరలుగా ఉందని తేల్చారు. పైన ఉండే మట్టి ఎంతో వదులుగా, పొడి పిండిలా ఉంటే.. కేవలం 6 సెంటీమీటర్ల లోతులోనే అది తడి జిగురు మట్టిలా చాలా గట్టిగా మారిపోతోంది. అంటే తక్కువ దూరంలోనే నేల స్వభావం పూర్తిగా మారిపోతోందని స్పష్టమైంది. ఈ రకమైన వైవిధ్యం గతంలో అమెరికా అపోలో మిషన్లు వెళ్లిన భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు.
నాసాకు ఎలా ఉపయోగపడుతుంది?
నాసా తన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనుషులను దించి అక్కడ శాశ్వత స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. చందమామ ఇలా మారుతుందని ఇస్రో కనిపెట్టడం వల్ల.. అక్కడ భవిష్యత్తులో ఇళ్లు కట్టాలన్నా, దిగాలన్నా ఈ పొరల స్వభావం ఎంతో ముఖ్యం. పైగా ఈ పొరలే చంద్రుడి లోపల ఉన్న మంచు గడ్డకట్టేలా కాపాడుతున్నాయని తెలియడంతో భవిష్యత్ మిషన్లకు ఇదొక గైడ్‌లా మారబోతోంది.