ఆసియా కప్ లో ఫైనల్ అవకాశం కోల్పోయిన వేదాంత్.. భావోద్వేగంగా స్పందించిన తండ్రి మాధవన్
- 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే విభాగంలో తృటిలో విఫలమైన వేదాంత్ జట్టు
- తన కుమారుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న మాధవన్
- వేదాంత్ కష్టానికే ఈ అవకాశం దక్కిందని వ్యాఖ్య
ఆసియా క్రీడల స్విమ్మింగ్ పోటీల్లో భారత ఈతగాళ్లకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే విభాగంలో బరిలోకి దిగిన వేదాంత్ మాధవన్, సజన్ ప్రకాశ్, దక్షన్ శశికుమార్, అనీశ్ సునీల్‌లతో కూడిన భారత టీమ్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో తృటిలో విఫలమైంది. 13 జట్లు పాల్గొన్న ఈ హీట్స్‌లో భారత బృందం 7:24.32 సెకన్ల సమయంతో 9వ స్థానంలో నిలిచింది. కేవలం 0.20 సెకన్ల స్వల్ప వ్యవధితో (7:24.10) ఖతార్ జట్టు 8వ స్థానాన్ని దక్కించుకుని ఫైనల్‌కు అర్హత సాధించగా, భారత్ పతక రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ ఫలితంపై స్పందించిన వేదాంత్, కేవలం 0.2 సెకన్లతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, సెప్టెంబర్ 23న జరగబోయే 200 మీటర్ల ఫ్రీస్టైల్, సెప్టెంబర్ 25న జరగబోయే 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. వేదాంత్ పోస్ట్‌ను అతడి తండ్రి, నటుడు ఆర్. మాధవన్ 'కృతజ్ఞత' ఎమోజీతో సోషల్ మీడియాలో పంచుకున్నారు.