Advertisement

ఏపీ అంటే 'అడ్వాన్స్‌డ్ ప్రదేశ్'.. చంద్రబాబు ఆలోచనలు మామూలుగా ఉండవు: రాజ్ నాథ్ సింగ్

Raj Nath Singh Praises Chandrababu Vision for Advanced Andhra Pradesh
  • పుట్టపర్తిలో వేల కోట్ల విలువైన భారీ రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, విజన్‌పై రాజ్ నాథ్ సింగ్ ప్రశంసల వర్షం
  • ఏపీని దేశానికే రక్షణ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా కీలక అడుగులు
  • కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు 8 కంపెనీల సంయుక్త ప్రయత్నం
  • రక్షణ ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ అపూర్వ వృద్ధి సాధించిందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ రంగ పటంలో అగ్రస్థానంలో నిలుపుతూ, రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రక అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా శుక్రవారం వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, యావత్ భారత రక్షణ రంగ స్వావలంబన ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

చంద్రబాబు విజన్‌పై ప్రశంసల జల్లు
ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, పాలనా సామర్థ్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. "నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో నాయకులను చూశాను. కానీ, టెక్నాలజీ పట్ల చంద్రబాబుకు ఉన్న పట్టు, అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత, భవిష్యత్తును అంచనా వేయగల ఆయన దూరదృష్టి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆయన ఆలోచనలు ఎప్పుడూ చిన్నవిగా ఉండవు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా ప్రశంసలు దక్కాయి" అని కొనియాడారు. 

గూగుల్ వంటి బహుళజాతి సంస్థ తన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఏపీని ఎంచుకోవడమే చంద్రబాబు సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. "చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, 'అడ్వాన్స్‌డ్ ప్రదేశ్'గా ఎదుగుతుందన్న పూర్తి విశ్వాసం నాకుంది" అని రాజ్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

వేల కోట్ల పెట్టుబడులతో కీలక ప్రాజెక్టులు
పుట్టపర్తిలో ప్రారంభమైన ప్రాజెక్టుల వివరాలను రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం.. ఇలా త్రివిధ దళాల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని వివరించారు.
1.అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కేంద్రం: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ఆధ్వర్యంలో, రూ.15,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐదో తరం యుద్ధ విమానం 'అమ్కా' ప్రాజెక్టులో భాగంగా రూ.2,000 కోట్లతో కోర్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాన్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి అత్యాధునిక సదుపాయం ప్రపంచంలోనే అతి కొద్ది ప్రదేశాల్లో ఉందని, ఇకపై ఆ జాబితాలో పుట్టపర్తి పేరు చేరనుందని అన్నారు.
2.భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) యూనిట్: రూ.480 కోట్లతో బీడీఎల్ ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంలో అత్యాధునిక అండర్‌వాటర్ సిస్టమ్స్, అటానమస్ అండర్‌వాటర్ వెహికల్స్, నెక్స్ట్ జనరేషన్ టార్పెడోలు తయారు చేస్తారు. ఇది మన నౌకాదళ సామర్థ్యాన్ని, బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తుంది.
3.భారత్ ఫోర్జ్ (ఆగ్నేయ) యూనిట్: భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన ఆగ్నేయ ఎనర్జిటిక్స్, రూ.1,500 కోట్ల పెట్టుబడితో అధునాతన ఆయుధాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతోంది.
4. హెచ్ ఎఫ్ సీఎల్ (HFCL) ఫ్యూజ్ ప్లాంట్: రూ.1,294 కోట్ల పెట్టుబడితో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (HFCL) ఆర్టిలరీ షెల్స్, బాంబులకు అవసరమైన ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

వీటితో పాటు, 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో ఒక 'డ్రోన్ సిటీ'ని ఏర్పాటు చేస్తున్నాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారుతుందని రాజ్ నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఆత్మనిర్భర్ భారత్' దిశగా పయనం
గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రక్షణ రంగం స్వరూపం పూర్తిగా మారిపోయిందని రాజ్ నాథ్ అన్నారు. "2014లో మన దేశీయ రక్షణ ఉత్పత్తి కేవలం రూ.46,000 కోట్లు. నేడు అది రికార్డు స్థాయిలో రూ.1.54 లక్షల కోట్లకు చేరింది, త్వరలోనే రూ.1.75 లక్షల కోట్లను దాటుతుంది. ఒకప్పుడు రూ.600 కోట్ల లోపు ఉన్న మన రక్షణ ఎగుమతులు, నేడు సుమారు రూ.40,000 కోట్లకు చేరుకున్నాయి. ఇది మన స్వావలంబన ప్రయాణానికి నిదర్శనం" అని ఆయన వివరించారు. 

ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా, లక్షలాది ఉద్యోగాలు సృష్టించి, ఒక సంపూర్ణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. బెంగళూరుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కర్ణాటకతో కలిసి ఒక భారీ 'మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్'గా తీర్చిదిద్దే ప్రణాళికపై ఆలోచించాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. దేశ నిర్మాణం అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమని, ఈ చారిత్రక కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బృందానికి, రాష్ట్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Raj Nath Singh
Chandrababu Naidu
Andhra Pradesh
Defense Projects
Puttaparthi
Indian Military
Defense Industry
AMCA Project
Bharat Dynamics Limited
Drone City

More Telugu News