Advertisement

అమెజాన్ ఉద్యోగం పోవడంతో.. టెక్ ప్రపంచం నుంచి వ్యాపారంలోకి మహిళా టెక్కీ

Mariya Harshitha moves from tech world to business after losing Amazon job
  • అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయిన హైదరాబాద్ మహిళ
  • కొత్త జాబ్ దొరక్క పౌల్ట్రీ వ్యాపారం వైపు అడుగులు
  • ఆరు కోడిపిల్లలతో మొదలుపెట్టి విజయవంతమైన వ్యాపారిగా గుర్తింపు
  • లింక్డ్‌ఇన్‌లో తన కథను పంచుకోగా వైరల్
  • పౌల్ట్రీ వ్యాపారానికి తన టెక్ నైపుణ్యాలను వాడుతున్న వైనం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ, నిరాశ చెందకుండా స్వయం ఉపాధి బాట పట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మాజీ టెక్కీ మరియ హర్షిత పౌల్ట్రీ వ్యాపారంలో రాణిస్తున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హర్షిత 2026 మార్చిలో అమెజాన్‌లో ఉద్యోగాన్ని కోల్పోయారు. అనంతరం మరో కార్పొరేట్ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం దక్కలేదు. అనేక తిరస్కరణలు ఎదురవడంతో, ఇతరుల ఉత్పత్తులను అభివృద్ధి చేసే బదులు సొంతంగా ఏదైనా ఎందుకు ప్రారంభించకూడదని ఆమె భర్త సలహా ఇచ్చారు.

ఈ క్రమంలో, తన పిల్లలకు నాణ్యమైన, నమ్మకమైన గుడ్లను అందించాలనే ఆలోచనతో వారు మొదట కొన్ని కోళ్లను పెంచడం ప్రారంభించారు. ఆరు కోడిపిల్లలతో మొదలైన ఈ ప్రయాణం, క్రమంగా కోళ్ల సంఖ్య పెరగడంతో ఒక వ్యాపారంగా రూపాంతరం చెందింది. తన ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఇక్కడ కూడా ఉపయోగిస్తూ, డిమాండ్, సప్లైని ట్రాక్ చేయడానికి ఆమె 'పవర్ బీఐ' వంటి టూల్స్ వాడుతుండటం విశేషం.

తన వ్యాపార అనుభవంపై ఆమె లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ చేశారు. "నాకంటూ ఇప్పుడు ఒక స్వంత ఉత్పత్తి ఉంది, అవే ఈ గుడ్లు. నాకు ఇష్టమైన పనిని చేస్తూనే, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ చేస్తున్న భావన కలుగుతోంది. ఈ గుడ్లు కూడా చాలా రుచిగా ఉన్నాయి" అని ఆమె ఆనందంగా పంచుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక పోస్ట్ ప్రస్తుతం వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Advertisement
Mariya Harshitha
Amazon Layoffs
Hyderabad Woman Entrepreneur
Techie Poultry Business
Success After Job Loss

More Telugu News