ఏపీ ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానం ఎవ‌రిదంటే..!

AP Ministers Ranked on File Clearance Speed Acham Naidu Tops
  • పాలనలో వేగం పెంచేందుకు ఫైళ్లను 24 గంటల్లో క్లియర్ చేయాలని సీఎం సూచన
  • ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడుకు మొదటి ర్యాంకు
  • పనితీరులో వెనుకబడ్డ మంత్రులు సవిత, పయ్యావుల, కొల్లు రవీంద్ర 
  • సీఎస్ సాయిప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా అభినందించిన చంద్ర‌బాబు
  • ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మంత్రుల ర్యాంకులను ఇకపై బహిర్గతం చేయవద్దని నిర్ణయం
పాలనలో వేగం పెంచడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కీలకమైన ఫైళ్లను 24 గంటల్లోపు పరిష్కరించాలని, అప్పుడే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుందని స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌ వేగమే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్‌’లో అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో మంత్రులు, కార్యదర్శులు, అధికారులకు ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు.

ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ-ఫైల్స్ పరిష్కార వేగం ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2026 మార్చి 11 నుంచి మే 5 మధ్య కాలంలో ఫైళ్ల పరిష్కారానికి తీసుకున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సగటున కేవలం 2.49 గంటల్లోనే ఫైళ్లను పరిష్కరించడం విశేషం. ఆయన తర్వాత మంత్రి రామానాయుడు 7.37 గంటలతో రెండో స్థానంలో, టీజీ భరత్ 10.54 గంటలతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్ పెద్ద సంఖ్యలో ఫైళ్లు వచ్చినా, సగటున 10 గంటల వ్యవధిలోనే పరిష్కరించడం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.

అదే సమయంలో కొందరు మంత్రులు ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడినట్లు ఈ నివేదిక వెల్లడించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఫైళ్లను క్లియర్ చేయడానికి సగటున 13 రోజుల సమయం తీసుకుంటూ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు. ఆమె కంటే ముందు మంత్రి పయ్యావుల కేశవ్ 9 రోజుల 14 గంటలతో, మంత్రి కొల్లు రవీంద్ర 6 రోజుల 7 గంటలతో చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.

అయితే, ఈ ర్యాంకుల ప్రకటనపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని భావించిన ముఖ్యమంత్రి, భవిష్యత్తులో మంత్రుల పనితీరుకు సంబంధించిన ర్యాంకులను బహిరంగంగా వెల్లడించవద్దని అధికారులకు సూచించినట్లు సమాచారం. పనితీరు మెరుగుపరుచుకోవడంపై అంతర్గతంగా దృష్టి సారించాలని, బహిరంగ విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
Go Back to Shorts
Chandrababu
AP files clearance
Andhra Pradesh governance
Acham Naidu
Minister rankings
File processing speed
Sai Prasad
Government efficiency
e-files
Payyaula Keshav

More Telugu News