'మేము కాపులం' టైటిల్ వివాదం.. జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను వాకౌట్.. నిజంగానే గొడవ జరిగిందా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మేము కాపులం' టైటిల్ వివాదం.. జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను వాకౌట్.. నిజంగానే గొడవ జరిగిందా?

Getup Srinu Angry With Journalist Jaffar Over Naga Babu Mem Kapulam Web Series Title
  • జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూలో గొడవపడ్డ గెటప్ శ్రీను
  • 'మేము కాపులం' వెబ్ సిరీస్ టైటిల్‌పై చెలరేగిన వివాదం
  • కులం పేరు వాడొద్దన్న జాఫర్‌పై శ్రీను తీవ్ర ఆగ్రహం
  • కుర్చీని తన్ని, ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసిన కమెడియన్
  • ఇది నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని చర్చించుకుంటున్న నెటిజన్లు
జబర్దస్త్ కమెడియన్, న‌టుడు గెటప్ శ్రీను, సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. తాను నటిస్తున్న వెబ్ సిరీస్ టైటిల్ విషయంలో మొదలైన చర్చ.. ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. పరిస్థితి ఎంతగా ముదిరిందంటే, గెటప్ శ్రీను తీవ్ర అసహనంతో కుర్చీని కాలితో తన్ని, "ఇదేం తొక్కలో ఇంటర్వ్యూ" అంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఇది నిజమైన గొడవా? లేక పబ్లిసిటీ స్టంటా? అనే చర్చకు దారితీసింది.

అసలేం జరిగింది?
తన తాజా ప్రాజెక్టుల గురించి మాట్లాడేందుకు గెటప్ శ్రీను, జాఫర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సంభాషణ తొలుత సరదాగానే సాగింది. తన తర్వాతి ప్రాజెక్ట్ నాగబాబుతో కలిసి చేస్తున్న ఒక వెబ్ సిరీస్ అని శ్రీను వెల్లడించారు. జాఫర్ ఆ వెబ్ సిరీస్ టైటిల్ ఏంటని అడగ్గా, 'మేము కాపులం' అని శ్రీను సమాధానమిచ్చారు. ఈ టైటిల్ విన్న వెంటనే జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "నాకు నచ్చలేదబ్బా" అని ముఖం మీదే చెప్పేశారు. ఇలా కులం పేరుతో టైటిల్స్ పెట్టడం సరికాదని సూచించారు.

దీనికి శ్రీను స్పందిస్తూ, తనకు కథ, తన పాత్ర బాగా నచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానని చెప్పారు. అయితే జాఫర్, "సినిమా బాగుండొచ్చు, కానీ కులాన్ని వాడుకోవడం ఎందుకు? రామ్ గోపాల్ వర్మ లాంటి వారే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' టైటిల్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కదా?" అని ప్రశ్నించారు. ఈ టైటిల్ పెట్టడం వెనుక వేరే కారణం ఉందని శ్రీను చెప్పబోగా, "వేరే ఏమున్నా సరే, కులం పేరుతో సినిమా ఏంటి?" అంటూ జాఫర్ కాస్త గట్టిగానే నిలదీశారు. కాంట్రవర్సీ కోసమే ఈ టైటిల్ పెట్టారా? అని కూడా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది.

కుర్చీని తోసేసి వాకౌట్
జాఫర్ ప్రశ్నలతో తీవ్ర అసహనానికి గురైన గెటప్ శ్రీను, "నన్ను మాట్లాడనివ్వవా?" అంటూ ఒక్కసారిగా కూర్చున‌ కుర్చీని తోసేసి.. "హేయ్.. ఈ తొక్కలో ఇంటర్వ్యూ" అని అరుస్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. శ్రీను వెళ్లిపోయిన తర్వాత జాఫర్ కెమెరా వైపు చూస్తూ, "నేను ఏమన్నా తప్పుగా అడిగానా? మీరే చూశారు కదా, ఎందుకంత సీరియస్ అవుతున్నారు?" అని వ్యాఖ్యానించారు.

ప్రమోషన్ స్టంటా?.. నిజమా?
ఈ వీడియో క్లిప్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు, "కులం పేరుతో టైటిల్ పెడితే తప్పేంటి? గతంలో ఇలాంటి పేర్లతో ఎన్నో సినిమాలు వచ్చాయి కదా?" అని గెటప్ శ్రీనుకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, చాలామంది మాత్రం ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అభిప్రాయపడుతున్నారు. వెబ్ సిరీస్‌కు ప్రచారం కల్పించడం కోసమే ఇలా స్క్రిప్ట్ ప్రకారం గొడవపడి, ఆ వీడియోను వైరల్ చేశారని విశ్లేషిస్తున్నారు. ఈ వివాదంపై స్పష్టత రావాలంటే గెటప్ శ్రీను లేదా జాఫర్ స్పందించే వరకు వేచి చూడాలి.
Advertisement
Getup Srinu vs Jaffar
Naga Babu
Mem Kapulam Web Series
Journalist Jaffar

More Telugu News