ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టా.. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్: సంజూ శాంసన్

Ive scored a few tons in the format but scoring it in Chepauk feels special says Sanju Samson
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ (115 నాటౌట్)తో మెరిశాడు. తద్వారా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీ తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదని, ముఖ్యంగా తనపై ఫ్రాంచైజీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితోనే ఆడానని శాంసన్ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్‌లో భాగంగా రవీంద్ర జడేజా, శామ్ కరన్‌లను వదులుకుని సీఎస్కే తనను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై ఉన్న బాధ్యత గురించి శాంసన్ మాట్లాడాడు. "ఫ్రాంచైజీ నాపై నమ్మకం ఉంచింది. వారి కోసం ఒక్క మ్యాచ్ అయినా గెలిపించి తీరాలని గట్టిగా అనుకున్నాను. ఆ భావన నాలో బలంగా ఉంది. సొంత మైదానంలో, అభిమానుల ముందు సెంచరీ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది" అని సంజూ తెలిపాడు.

ప్రపంచకప్‌లో విజయం సాధించడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతంగా బరిలోకి దిగానని శాంసన్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 22 పరుగులే చేసి విఫలమవడంపై స్పందిస్తూ.. "వరుస వైఫల్యాల తర్వాత సందేహాలు రావడం సహజం. కానీ, నా కెరీర్‌లో ఎన్నోసార్లు ఇలాంటి క్లిష్ట‌ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాను. వాటి నుంచి ఎలా పుంజుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకే క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుని, పవర్‌ప్లే తర్వాత వేగంగా ఆడాను" అని చెప్పాడు.

మూడు ఫ్రాంచైజీలు.. మూడు సెంచరీలు.. సంజూ శాంసన్ అరుదైన ఘనత
ఈ సెంచరీతో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా శతకాలు నమోదు చేశాడు. అంతేగాక ఒక ఐపీఎల్ సీజన్‌లో తొలి సెంచరీని నాలుగు సార్లు (2017, 2018, 2021, 2026) నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు వెనుక ఉన్న రహస్యం గురించి అడగ్గా.. "దానికో సీక్రెట్ ఉంది, కానీ దాన్ని బయటపెట్టను" అని నవ్వేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు 189 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
Go Back to Shorts
Sanju Samson
Chennai Super Kings
CSK
IPL 2026
Delhi Capitals
IPL centuries
Sanju Samson century
Chepauk Stadium
IPL Records
Indian Premier League

More Telugu News