Vaddiraju Ravichandra: కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదు: వద్దిరాజు రవిచంద్ర
కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించిన గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి, వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని, ముఖ్యంగా యువతను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మైదానాల అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వనమా రాఘవేంద్రరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.