Revanth Reddy: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే!

Revanth Reddy Govt to Deliver RC DL Cards Directly to Homes
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేయనుంది. కార్డుల ముద్రణ, పంపిణీలో నెలల తరబడి జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు 'సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్' విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని 61 ఆర్టీఏ కార్యాలయాల్లో కార్డుల ముద్రణ జరుగుతుండటంతో తీవ్ర జాప్యం నెలకొంది. ఏటా సుమారు 15 లక్షల కార్డులు జారీ చేయాల్సి ఉండగా, లబ్ధిదారులకు చేరడానికి నెలల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తనిఖీల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏజెంట్ల వద్ద వందలకొద్దీ కార్డులు లభ్యం కావడంతో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులను ముద్రించి, నేరుగా వాహనదారుడి చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తారు. దీనివల్ల ఏజెంట్ల ప్రమేయం పూర్తిగా తొలగిపోతుంది. కార్డులు చేరలేదని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి, డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవసరం కూడా తప్పుతుంది. ఈ సంస్కరణతో పాటు రవాణా శాఖకు ఏటా యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే సుమారు రూ. 135 కోట్లను శాఖకే కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ఈ నిధులతో శాఖాపరమైన సేవలను మరింత మెరుగుపరచడానికి వీలు కలుగుతుంది.
Go Back to Shorts
Revanth Reddy
Telangana transport department
Vehicle registration certificate
Driving license
RTA office
Centralized printing dispatch
Telangana government
Traffic rules
Duplicate RC DL

More Telugu News