Hardeep Singh Puri: మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Hardeep Singh Puri Clarifies No Lockdown in India Amidst Rumors
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. 

"భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం. వదంతులు వ్యాప్తి చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం బాధ్యతారహితమైన చర్య, హానికరం" అని హర్దీప్ సింగ్ పురి తన ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఇంధనం, సరఫరా వ్యవస్థలు, నిత్యావసరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు ఇంధనం, ఇతర నిత్యావసరాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు, దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై నెలకొన్న కొన్ని వార్తల నేపథ్యంలో లాక్‌డౌన్ విధించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు 2020లో విధించిన లాక్‌డౌన్‌కు ఆరేళ్లు పూర్తయిన సందర్భం కూడా కావడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.

అంతేగాక‌ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ "సన్నద్ధంగా ఉండాలి" అని చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అన్వయించారు. కోవిడ్ తరహా సన్నద్ధత అంటే పరిపాలనాపరమైన ముందుజాగ్రత్త చర్యలే తప్ప, ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడం కాదని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌పై వస్తున్న అన్ని రకాల ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర మంత్రి తాజాగా ఈ ప్రకటన చేశారు.


Go Back to Shorts
Hardeep Singh Puri
Lockdown India
India Lockdown Rumors
Central Government
Narendra Modi
Fuel Supply India
LPG Gas Supply
Economic Impact
West Asia Tensions
India News

More Telugu News