AR Rahman: ధోనీ ఫేవరెట్ సాంగ్ అదేనట.. ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన ఏఆర్ రెహమాన్

AR Rahman Reveals MS Dhonis Favorite Song Munbe Vaa
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇష్టమైన పాట ఏంటో ఆస్కార్ విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. తన స్వరకల్పనలో వచ్చిన 'మున్బే వా' పాట అంటే ధోనీకి ఎంతో ఇష్టమని, ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా తనతో చెప్పారని రెహమాన్ తెలిపారు. ఈ ఆసక్తికర సంభాషణ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చోటుచేసుకుంది.

ఐపీఎల్ 19వ సీజన్ (2026) ప్రారంభానికి ముందు సీఎస్కే యాజమాన్యం తమ అభిమానుల కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 'రోర్ 2026' పేరుతో ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ తన సంగీత ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ ఈవెంట్ అనంతరం సీఎస్కే తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న వీడియోలో రెహమాన్ పలు విషయాలు వెల్లడించారు.

"ఇంత పెద్ద స్టేడియంలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ అవకాశం కల్పించిన సీఎస్కేకు, అభిమానులకు నా కృతజ్ఞతలు. ధోనీ సాబ్, ఇతర ఆటగాళ్లకు కొన్ని పాటలను అంకితమిచ్చాను. ఇది నా ఇతర కచేరీలకు భిన్నమైన అనుభూతిని ఇచ్చింది" అని రెహమాన్ వివరించారు.

ధోనీతో తన సంభాషణ గురించి మాట్లాడుతూ.. సాధారణంగా తామిద్దరం ఎయిర్‌పోర్టుల్లోనో, మరెక్కడైనా కలిసినప్పుడు 'హాయ్, బాయ్' చెప్పుకోవడానికే సమయం సరిపోతుందని అన్నారు. కానీ, ఈసారి మాత్రం ఇద్దరం కలిసి కొన్ని నిమిషాలు మాట్లాడుకునే అవకాశం దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు. "ధోనీ చాలా మంచి వ్యక్తి. ఆయనకు నా కొడుకు తెలుసు, నా కొడుక్కి ఆయన తెలుసు. ఆ కొద్దిసేపటి సంభాషణ చాలా సరదాగా సాగింది" అని రెహమాన్ చెప్పారు.

ఈ సందర్భంగానే ధోనీ తన ఫేవరెట్ సాంగ్ గురించి చెప్పారని రెహమాన్ గుర్తుచేసుకున్నారు. 2006లో వచ్చిన 'సిల్లును ఒరు కాదల్' సినిమాలోని 'మున్బే వా' పాట చాలా మందికి ఇష్టం. ఆ పాట కేవలం సురేశ్ రైనాకు మాత్రమే కాదు, తనకూ ఫేవరెట్ అని ధోనీ తనతో అన్నారని రెహమాన్ వెల్లడించారు.

సీఎస్కేకు ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపును చూసి ఆశ్చర్యపోయానని, తాను దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు కొందరు తనను గుర్తుపట్టి 'ఓ మీరు సీఎస్కే ప్రాంతం వారా' అని అడిగారని రెహమాన్ గుర్తు చేసుకున్నారు. క్రికెట్, సంగీతానికి సరిహద్దులు లేవని, అవి ప్రజలను ఏకం చేసి సమష్టి ఆనందాన్ని పంచుతాయని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
AR Rahman
MS Dhoni
Dhoni
Munbe Vaa
Chennai Super Kings
CSK
IPL 2026
Roar 2026
Suresh Raina
Tamil Music

More Telugu News