Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల పోరు: బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్.. తమిళనాట స్టాలిన్ జోరు!

Mamata Banerjee Likely to Win Bengal Stalin to Dominate Tamil Nadu
షార్ట్స్‌లో చూడండి
దేశంలోని నాలుగు కీలక రాష్ట్రాలు, యూటీ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ, పలు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార పార్టీలే తిరిగి పీఠమెక్కనుండగా, అస్సాంలో బీజేపీ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అయితే, కేరళలో మాత్రం హోరాహోరీ పోరు తప్పదని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

బెంగాల్‌లో మమత హ్యాట్రిక్..
‘వోట్ వైబ్’ సంస్థ సర్వే ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 294 స్థానాలున్న రాష్ట్రంలో టీఎంసీ 184 నుంచి 194 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ 98 నుంచి 108 స్థానాలతో సరిపెట్టుకోవచ్చని, లెఫ్ట్ పార్టీలు 1 నుంచి 3 సీట్లకే పరిమితమవుతాయని పేర్కొంది.

తమిళనాట డీఎంకే క్లీన్ స్వీప్..
‘అగ్ని న్యూస్ సర్వీస్ (ఏఎస్ఎస్)’ సర్వే ప్రకారం, తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి ఏకంగా 180 సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 50 నుంచి 60 స్థానాలకే పరిమితం కానుంది. ఇదే సమయంలో, రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటుడు విజయ్ ‘టీవీకే’ పార్టీ సుమారు 10 శాతం ఓట్లను చీల్చనుండటం గమనార్హం.

అస్సాం, కేరళలో ఇలా..
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోనుంది. ‘వోట్ వైబ్’ సర్వే ప్రకారం.. 126 సీట్లలో ఎన్డీయే 80 నుంచి 90 స్థానాల్లో గెలుపొందనుంది. విపక్ష ఇండియా కూటమికి 29 నుంచి 39 సీట్లు దక్కవచ్చని అంచనా. మరోవైపు, కేరళలో మాత్రం అధికార, విపక్ష కూటముల మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోరు సాగనుంది. ‘మ్యాట్రిజ్-ఐఏఎన్ఎస్’ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమికి 61-71 సీట్లు, యూడీఎఫ్‌కు 58-69 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Go Back to Shorts
Mamata Banerjee
West Bengal Elections
TMC
Stalin
Tamil Nadu Elections
DMK
Assam Elections
Kerala Elections
Opinion Polls
Indian Elections

More Telugu News