Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సీఎం పదవికి నితీశ్ కుమార్ గుడ్‌బై..!

Nitish Kumar Resigns as Bihar CM in Political Twist
  • రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వనున్న జేడీయూ చీఫ్
  • కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు వెల్లడి
  • కొత్త ముఖ్యమంత్రి బీజేపీ నుంచేనని ప్రచారం
బిహార్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యసభకు వెళ్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

నితీశ్ కుమార్ మనసులో మాట..
‘‘గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు. బిహార్ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేశాను. నా పార్లమెంటరీ జీవితం ప్రారంభమైనప్పటి నుండి నాకు ఒక కోరిక ఉండేది.. రాష్ట్రంలోని రెండు చట్టసభలతో (అసెంబ్లీ, కౌన్సిల్) పాటు, పార్లమెంట్‌లోని రెండు సభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాను. ఆ కోరికను నెరవేర్చుకోవడానికే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని నితీశ్ పేర్కొన్నారు.

కీలక పరిణామాలు..
రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో నీతీశ్ కుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. నితీశ్ తప్పుకోవడంతో బిహార్‌కు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ప్రస్తుతం జేడీయూ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నందున, ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. "కొత్త బాధ్యతలు చేపట్టినప్పటికీ, బిహార్‌తో నా బంధం కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని నితీశ్ హామీ ఇచ్చారు.

కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర..
బిహార్ రాజకీయాల్లో 'చాణక్యుడిగా' పేరున్న నితీశ్ కుమార్, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో, ఆయన రాజ్యసభకు వెళ్లడం జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లోనే బిహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు కానుంది. నితీశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయనుంది.
Nitish Kumar
Bihar politics
Bihar CM
JDU
Rajya Sabha
Bihar BJP
Bihar Chief Minister
Indian Politics
Political Analysis
2024 Elections

More Telugu News