Advertisement

కంపెనీలు ఏపీని ఎంచుకోవడానికి కారణం ఇదే: మంత్రుల బృందం తొలి సమావేశంలో లోకేశ్

Nara Lokesh chairs first GoM meeting to implement automatic incentive system for MSMEs
  • నారా లోకేశ్ అధ్యక్షతన మంత్రుల బృందం తొలి సమావేశం
  • పరిశ్రమల రాకకు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే కారణం అని లోకేశ్ వెల్లడి
  • రాష్ట్రానికి రూ.29.30 లక్షల కోట్ల పెట్టుబడులతో 1037 పరిశ్రమలు
  • దీని ద్వారా 24.66 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
  • పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశం
  • ఎంఎస్ఎంఇలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రుల బృందం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో భారీగా పెట్టుబడులు రానున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.29.30 లక్షల కోట్ల పెట్టుబడులతో 1037 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు ముందుకు వచ్చాయని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వీటి ద్వారా సుమారు 24.66 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రుల బృందం (GoM) తొలి సమావేశం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రతి ప్రాజెక్టును నిరంతరం ట్రాక్ చేస్తూ, అవి త్వరితగతిన కార్యరూపం దాల్చేలా (గ్రౌండింగ్) చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "పారిశ్రామిక సంస్థలు ఏపీని ఎంచుకోవడానికి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ప్రధాన కారణం. దీనిని ప్రతి అధికారి చిత్తశుద్ధితో అమలు చేయాలి" అని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులు, ప్రోత్సాహకాల విషయంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతినెలా నిర్వహించే సమీక్షా సమావేశంలో కచ్చితమైన పురోగతి కనిపించాలని దిశానిర్దేశం చేశారు.

నవంబర్‌లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ ద్వారా మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చే అవకాశం ఉందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు పునరుత్పాదక ఇంధన అవసరాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సూచించారు.

ముఖ్యంగా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ)పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇవి ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని మంత్రి అన్నారు. నిర్ణీత సమయంలో పరిశ్రమలను ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఇలకు ప్రోత్సాహకాలు అందించేందుకు పూర్తిస్థాయి ఆటోమేటిక్ వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. గత రెండేళ్లలో 1,20,897 ఎంఎస్ఎంఇలకు ప్రోత్సాహకాలు అందించినట్లు అధికారులు ఈ సమావేశంలో వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగూరి నారాయణ, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh MSME Incentives
AP Job Creation
Speed of Doing Business
Andhra Pradesh Industrial Investments
AP Partnership Summit

More Telugu News