London fire accident: లండన్ అగ్ని ప్రమాదం.. నిజామాబాద్ యువకుడు కూడా మృతి

London Fire Claims Life of Telugu Student Kamineni Sai Srikar
  • ఈ నెల 23న సౌత్ లండన్‌ లోని క్రోయ్డన్‌ లో అగ్ని ప్రమాదం
  • మంటల్లో చిక్కుకుని పెద్దాపురంకు చెందిన గంటి అభిషేక్ సజీవదహనం
  • తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన నిజామాబాద్ యువకుడు సాయి శ్రీకర్
  • బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన వైద్యులు.. శుక్రవారం మృతి చెందాడని వెల్లడి


ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థుల జీవితాలు అగ్నిప్రమాదంలో అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ నెల 23న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో యువకుడు శుక్రవారం రాత్రి మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

అద్దె ఇంట్లో మంటలు..
కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన గంటి అభిషేక్ (28), నిజామాబాద్ జిల్లాకు చెందిన కామినేని సాయి శ్రీకర్ (26), మరో యువకుడు.. ముగ్గురూ ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లారు. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగంలో చేరారు. దక్షిణ లండన్‌ లోని క్రోయ్డన్ ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో ముగ్గురూ కలిసి అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 23న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఇల్లంతా మంటలు, పొగ వ్యాపించడంతో ఊపిరాడక అభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన మిగతా ఇద్దరిని అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీకర్ ను పరీక్షించిన వైద్యులు.. అతడిని బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్.. శుక్రవారం కన్నుమూశారు. మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.

పుట్టెడు దుఃఖంలోనూ అవయవ దానం..

ఒక్కగానొక్క కొడుకు దూరమైనా, శ్రీకర్ తల్లిదండ్రులు (అంజనేయ ప్రసాద్, రేణుక) ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన కొడుకు మరో నలుగురికి ప్రాణదానం చేయాలని భావించి అవయవ దానానికి అంగీకరించారు. శ్రీకర్ అవయవాల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా నిజామాబాద్‌కు పంపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

London fire accident
Telugu student death
Nizamabad youth
Ganti Abhishek
Kamineni Sai Srikar
London
Croydon fire
Organ donation
Brain dead
Fire accident

More Telugu News