India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్: జింబాబ్వేపై భారత్ భారీ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

India vs Zimbabwe India wins big T20 World Cup match
  • సెమీస్ రేసులో నిలిచేందుకు కీలక మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
  • తొలుత బ్యాటింగ్‌లో 256 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా
  • ఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన జింబాబ్వే 
  • ఒంటరి పోరాటం చేసిన జింబాబ్వే బ్యాటర్ బ్రయాన్ బెన్నెట్ (97*)
  • బౌలింగ్‌లో రాణించిన అర్ష్‌దీప్ సింగ్.. మూడు వికెట్లు కైవసం
టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించిన భారత్, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి టోర్నీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

భారత్ నిర్దేశించిన 257 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం బెదరకుండా భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. కేవలం 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. మరో ఓపెనర్ మరుమణి (20) నెమ్మదిగా ఆడగా, కెప్టెన్ సికందర్ రజా (31) కాసేపు బెన్నెట్‌కు సహకరించాడు.

బెన్నెట్, రజా క్రీజులో ఉన్నంతసేపు జింబాబ్వే స్కోరు బోర్డు ముందుకు కదిలింది. కానీ, అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో వారిపై ఒత్తిడి పెరిగింది. రజా ఔటైన తర్వాత జింబాబ్వే ఓటమి ఖాయమైంది. బెన్నెట్ పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) అద్భుతమైన హాఫ్ సెంచరీతో శుభారంభం అందించాడు. సంజూ శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (33) కూడా వేగంగా ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50*), తిలక్ వర్మ (16 బంతుల్లో 44*) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ కేవలం 31 బంతుల్లోనే 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 250 దాటించారు.

ఈ విజయంతో భారత్ తన సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే తమ తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ మార్చి 1న జరగనుంది. అటు, జింబాబ్వేపై టీమిండియా విజయంతో... దక్షిణాఫ్రికా జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైంది. 
India vs Zimbabwe
T20 World Cup
Indian Cricket Team
Hardik Pandya
Arshdeep Singh
Suryakumar Yadav
Abhishek Sharma
Cricket
T20
Bryan Bennett

More Telugu News