గత ఫైనలిస్టుల సమరం.. రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ

India vs South Africa T20 World Cup Super 8 Clash
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సూపర్-8 రౌండ్‌లో తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2024 ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడిన ఈ రెండు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు తమ సూపర్-8 ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి.

సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు గ్రూప్-ఎలో రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. తొలి రౌండ్‌లో ఈ నాలుగు జట్లు కూడా తమ తమ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచి సూపర్-8కు అర్హత సాధించాయి. దీంతో ఈ గ్రూపును కఠినమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పొట్టి ఫార్మాట్‌లో 35 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత జట్టు 21 మ్యాచ్‌లలో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా కేవలం 13 విజయాలతో సరిపెట్టుకుంది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు ఏడుసార్లు పోటీపడగా.. భారత్ ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. ప్రొటియాస్ జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది.

అంతేకాదు, టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన చరిత్ర దక్షిణాఫ్రికాకు లేదు. 2014 సెమీఫైనల్, చారిత్రాత్మక 2024 ఫైనల్‌లో భారత్ చేతిలో సఫారీ జట్టు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై భారత్‌కు మానసికంగా కూడా పైచేయి ఉంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ భారత్ 3-1 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

తాజా ఫామ్ చూస్తే, భారత్ తన చివరి ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలవగా.. దక్షిణాఫ్రికా ఒక ఓటమిని చవిచూసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టులో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు, ఐడెన్ మార్క్‌రమ్ సారథ్యంలోని సఫారీ జట్టులో క్వింటన్ డి కాక్, కగిసో రబాడ, డేవిడ్ మిల్లర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. గణాంకాలు, ఇటీవలి ఫామ్ పరంగా భారత్ స్పష్టమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, తమపై ఉన్న నాకౌట్ ముద్రను చెరిపేసుకోవాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Go Back to Shorts
India vs South Africa
T20 World Cup 2026
Rohit Sharma
Ishan Kishan
Hardik Pandya
Jasprit Bumrah
Kuldeep Yadav
Aiden Markram
Quinton de Kock
Kagiso Rabada

More Telugu News