Sahil Dhaneshra: బైకర్‌ను ఢీకొట్టిన మైనర్: మృతుడి తల్లిని జీవితాంతం క్షమాపణ కోరుతానన్న తండ్రి

Sahil Dhaneshra accident minors father apologizes
  • ఢిల్లీలో మైనర్ కారు ప్రమాదంపై స్పందించిన నిందితుడి తండ్రి
  • తన కుమారుడు పెద్ద తప్పు చేశాడని, సిగ్గుపడుతున్నానంటూ క్షమాపణ
  • సోషల్ మీడియా రీల్స్ కోసమే వేగంగా నడిపాడని మృతుడి తల్లి ఆరోపణ
  • 10వ తరగతి పరీక్షల కోసం మైనర్‌కు మధ్యంతర ఉపశమనం
  • వాహన యజమానిగా తండ్రిపైనా కేసు నమోదు  
ఢిల్లీలో ఇటీవల ఓ బాలుడు కారు నడుపుతూ 23 ఏళ్ల యువకుడి మృతికి కారణమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంపై నిందితుడి తండ్రి తాజాగా స్పందించి బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన కుమారుడు చాలా పెద్ద తప్పు చేశాడని, అందుకు ఒక కుటుంబంగా తాము తీవ్రంగా సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి తల్లిని తన జీవితాంతం క్షమాపణ కోరుతూనే ఉంటానని ఆయన అన్నారు.

ఈ నెల 3న ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తన తండ్రికి చెందిన స్కార్పియో కారును వేగంగా నడుపుతూ, ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల సాహిల్ ధనేశ్రా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి ఆగి ఉన్న ట్యాక్సీని ఢీకొట్టడంతో దాని డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

అయితే, మృతుడి తల్లి ఇన్నా మకన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి ప్రమాదం కారణం కాదని, నిందితుడు తన సోదరితో కలిసి సోషల్ మీడియా కోసం 'ఫన్ రీల్స్' చిత్రీకరిస్తూ, రాంగ్ లేన్‌లో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె ఆరోపించారు. దీనిపై నిందితుడి తండ్రి మాట్లాడుతూ తాను పని మీద గోరఖ్‌పూర్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, తెలియని వయసులో తన కొడుకు కారు తాళాలు తీసుకుని ఉంటాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కొడుకు పారిపోలేదని, సహాయం చేశాడని కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడైన మైనర్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా, అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. అయితే, 10వ తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు అతడికి మధ్యంతర ఉపశమనం లభించింది. మరోవైపు, వాహన యజమానిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తండ్రిపై కూడా మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Sahil Dhaneshra
Delhi accident
minor car accident
Dwarka accident
car accident India
juvenile justice board
road accident
negligence
motor vehicle act

More Telugu News