Botsa Satyanarayana: ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు... అంతకుమించి బడ్జెట్‌లో ఏముంది?: బొత్స

Botsa Criticizes AP Budget Focus on Names Not Substance
  • కూటమి బడ్జెట్‌లో నాయకుల పేర్లు తప్ప కేటాయింపులు లేవన్న బొత్స
  • మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి మోసం చేశారని విమర్శ
  • ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ
  • రాష్ట్ర అప్పుల లెక్కలు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని వ్యాఖ్య
  • ఈ బడ్జెట్ ప్రజల ధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసిందని తీవ్ర విమర్శ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆత్మస్తుతి... పరనింద అన్నట్టు బడ్జెట్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఇది అంకెల గారడీతో కూడిన పసలేని బడ్జెట్ అని, ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు ఏవీ లేవని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా దెబ్బతీసిందని, ఇది మోసపూరిత పత్రమని ఆయన అభివర్ణించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో బొత్స మాట్లాడుతూ, ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు.

మహిళా సాధికారతపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 

"గతంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి, వారిలో పారిశ్రామిక స్ఫూర్తిని నింపడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పథకాన్ని తెచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సున్నా వడ్డీని అమలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే సున్నా వడ్డీ డబ్బులు జమ అయ్యేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా ఆ సున్నా వడ్డీ పథకం ఏమైందో తెలియదు. బడ్జెట్‌లో దానికి కేటాయింపులు లేవు. ఎలాంటి ఆర్థిక చేయూత లేకుండా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా మారుస్తారో చంద్రబాబు చెప్పాలి. ఇది మహిళలను మోసం చేయడం కాదా?" అని బొత్స ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం కోత పెట్టిందని బొత్స ఆరోపించారు. "గతంలో ఉపాధి హామీ పథకం కింద 100 శాతం నిధులను కేంద్రమే భరించేది. ఇప్పుడు కేంద్రం నిబంధనలు మార్చి మెటీరియల్, లేబర్ కాంపోనెంట్లలో 40 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పింది. గత ప్రభుత్వాల హయాంలో ఏటా సగటున రూ. 5,000 కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేసేవారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రం కనీసం రూ. 2,000 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్‌లో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే చూపించారు. మిగిలిన బ్యాలెన్స్ సంగతేంటి? అంటే ఈ పథకాన్ని కూడా నీరుగార్చబోతున్నారా?" అని ఆయన నిలదీశారు.

రాష్ట్ర అప్పుల విషయంలోనూ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని బొత్స ఆరోపించారు. రాష్ట్ర విభజన నుంచి వారసత్వంగా రూ. 9.46 లక్షల కోట్ల అప్పులు వచ్చాయని చెప్పడం సత్యదూరమని అన్నారు. 

"మా ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్లతో కలిపి మేం చేసిన అప్పు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్ల అప్పు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే, అప్పుల భారాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని బొత్స వివరించారు. ఈ బడ్జెట్‌లో కేవలం ప్రగల్భాలు తప్ప, నిర్దిష్ట కేటాయింపులు, ప్రజలకు భరోసా ఇచ్చే అంశాలు ఏవీ లేవని విమర్శించారు.




Botsa Satyanarayana
Andhra Pradesh Budget
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
NREGS Funds
Women Empowerment
Zero Interest Scheme
State Debts
AP Politics

More Telugu News