Sunil Gavaskar: బెదిరిస్తే ఎదురు నిలబడండి.. పాక్ ఆరోపణలపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar Fires Back at Pakistan Allegations
  • భారత్, ఐసీసీ కలిసి తమను బెదిరిస్తున్నాయని పాక్‌ ఆరోపణ
  • ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సునీల్ గవాస్కర్
  • బెదిరిస్తే ఎదుర్కోవాలి కానీ పారిపోకూడదని స‌న్నీ చురక
మ‌రికొన్ని గంట‌ల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుండగా, క్రికెట్ కంటే అనూహ్య పరిణామాలు, డ్రామానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు, పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల‌ 15న భారత్‌తో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్‌లో తమ జట్టు పాల్గొనదని ప్ర‌క‌టించింది. షెడ్యూల్ ప్రకారం టాస్ కోసం భారత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినా, పాక్ జట్టు మాత్రం రాదని తేలిపోయింది.

భారత్, ఐసీసీతో కలిసి తమను, ఇతర క్రికెట్ దేశాలను 'బుల్లీయింగ్' (బెదిరింపులకు) గురిచేస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజమ్ సేఠీ సమర్థించాడు. చాలా కాలంగా బీసీసీఐ తమపై ఆధిపత్యం చెలాయిస్తోందని, ఈ నిర్ణయంతో ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన అవకాశం లభించిందని ఆయన వ్యాఖ్యానించాడు.

అయితే, పాకిస్థాన్ చేస్తున్న ఈ ఆరోపణలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వ్యాఖ్యలపై స‌న్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ ఎవరినీ బెదిరించడం లేదని, కేవలం తమ పని తాము చూసుకుంటోందని ఆయన స్పష్టం చేశాడు. "ఎప్పుడూ మేమే సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మొదటి అడుగు వేస్తాం. మా గాయకులను, నటులను వారు ఎప్పుడైనా ఆహ్వానించారా? 2008 ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఆడారు కదా?" అని గవాస్కర్ గుర్తుచేశాడు.

"బుల్లీయింగ్ అనే పదాన్ని సాకుగా చెప్పడం చాలా సులభం. మేం ఎవరినీ బెదిరించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ పాకిస్థాన్‌లో ఆడబోమని భారత్ ముందుగానే చెప్పింది. అప్పుడు కూడా అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరిగాయి. ఇందులో బెదిరింపు ఎక్కడుంది? నిజంగా మిమ్మల్ని బెదిరిస్తున్నట్లే అనిపిస్తే, ఆ బెదిరింపులకు ఎదురు నిలబడాలి కానీ ఇలా మ్యాచ్ బహిష్కరించడం సరికాదు" అని గవాస్కర్ ఘాటుగా బదులిచ్చాడు.
Sunil Gavaskar
T20 World Cup 2026
Pakistan
BCCI
ICC
Najam Sethi
India vs Pakistan
Cricket
Bullying
Champions Trophy

More Telugu News