Fake Baba: లంకె బిందెల పేరిట టోకరా... దొంగ బాబా అరెస్ట్

Kadamananchi Narsimhulu Arrested in Lanke Bindelu Scam
  • లంకె బిందెల పేరుతో దొంగ బాబా మోసం
  • దొంగ బాబాను ఆశ్రయించి మోసపోయిన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ 
  • నిందితుడిని అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులు
మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని లక్షల్లో డబ్బులు దోచుకుంటున్న దొంగ బాబా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్ది రోజుల క్రితం వాస్తు పరిజ్ఞానం, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు చెప్పుకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, వాటి వల్ల కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతున్నాయని నమ్మబలికాడు. వాటిని తొలగించకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని భయపెట్టాడు. 

క్షుద్ర పూజలు నిర్వహించి లంకె బిందెలను తీసివేస్తామని నమ్మించి ఇందుకు రూ.8.20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. బాధిత కుటుంబం ఇటీవల కామారెడ్డిలో సదరు వ్యక్తిని కలసి డబ్బులు అందించింది. అయితే ఆ తర్వాత అతను ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ప్రధాన నిందితుడిగా సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి నర్సింలు అలియాస్ నర్సిరెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు అనుచరులను త్వరలో పట్టుకుంటామని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 

పోలీసుల విచారణలో నర్సింలు మరో ఇద్దరితో కలిసి ముఠా ఏర్పాటు చేసి, గుప్త నిధులు, క్షుద్ర పూజల పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు తేలింది. గతంలో కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి బిక్షాటన పేరుతో వెళ్లి, లంకె బిందెలు ఉన్నాయంటూ రూ.14 లక్షలు డిమాండ్ చేశాడని, ఆమె వద్ద రూ.3 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా, ఇదే తరహాలో పలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 

నర్సింలుపై ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగ బాబాలు, మూఢనమ్మకాల పేరుతో భయపెట్టే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. క్షుద్ర పూజలు, లంకె బిందెల పేరుతో మోసాలకు పాల్పడేవారి మాటలను నమ్మవద్దని, ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

More Telugu News

Fake Baba
fraud baba arrest
treasure hunt scam
superstition fraud
Kamareddy police
Telangana crime
cheating case
occult practices
police investigation
Kadamananchi Narsimhulu