ఇళ్ల కూల్చివేతలు.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించిన శశిథరూర్
- బెంగళూరులో ఇళ్ల కూల్చివేత డ్రైవ్‌ను సమర్థించిన శశిథరూర్
- కూల్చివేతలకు గురైన ఇళ్లు ప్రభుత్వ భూముల్లో నిర్మించారన్న ఎంపీ
- కూల్చివేతలకు సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి
కూల్చివేతకు గురైన ఇళ్లు ప్రభుత్వ భూముల్లో నిర్మించారని ఆయన తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజలు చట్టవిరుద్ధంగా ఉంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని, అంతేకాకుండా అది వ్యర్థాలను పారవేసే ప్రాంతమని, అక్కడ అక్రమంగా ఇళ్లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. విషపూరిత వ్యర్థాలు అక్కడి జలాలను కలుషితం చేయడం వల్ల అది ఎంత మాత్రం సురక్షితం కాదని అన్నారు. నివసించడానికి ఆ ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని థరూర్ తెలిపారు.
కూల్చివేతలకు సంబంధించి అక్కడు నివసిస్తున్న వారికి ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయ గృహాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కూల్చివేతల వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పేదరికం కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది పూర్తిగా భూ యాజమాన్య హక్కులు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశమని ఆయన నొక్కి చెప్పారు.