స్టాలిన్ ఓటమి నన్ను షాక్‌కు గురిచేసింది: ప్రకాశ్ రాజ్
- విజయ్ పాలనపై అప్పుడే మాట్లాడటం సరికాదన్న ప్రకాశ్ రాజ్
- బీజేపీ పతనానికి సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
- తనకు కూడా మోదీనే ప్రధానమంత్రి అన్న ప్రకాశ్ రాజ్
కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఊహించని రీతిలో పరాజయం పాలవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పును ఆకాంక్షించే ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. విజయ్ ప్రభుత్వ పాలనను అప్పుడే విమర్శించడం సరికాదని... కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయాన్నయినా ఇవ్వాలని అన్నారు. ఏడాది పాలన పూర్తయిన తాను స్పందిస్తానని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందని... వారి పతన సమయం ఆసన్నమైందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. త్వరలోనే వారి విధానాల తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, దీనికి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని, ఆయనకు తాను ఓటు వేయకపోయినా... తనకు కూడా ఆయనే ప్రధానమంత్రి అని చెప్పారు. అందుకే ప్రజా సమస్యలపై ఆయనను నిలదీసే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు.