మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే వీళ్లిద్దరినీ రాళ్లతో కొట్టి చంపుతారు: సీఎం రేవంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే వీళ్లిద్దరినీ రాళ్లతో కొట్టి చంపుతారు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KCR Over Telangana Water Rights
  • రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జలవివాదాన్ని రెచ్చగొడుతున్నారన్న రేవంత్
  • గత ప్రభుత్వం తెలంగాణకు 34 శాతం వాటాకే అంగీకరించి అన్యాయం చేసిందని ఆరోపణ
  • కేసీఆర్, హరీశ్‌ల సంతకాలు తెలంగాణ పాలిట మరణ శాసనం అన్న రేవంత్
  • 'నీళ్లు-నిజాలు' పేరుతో ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నేతలకు అవగాహన కార్యక్రమం
  • జలవివాదాల అంశంపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం
తెలంగాణ నీటి హక్కుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు జల వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి, రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గురువారం ప్రజాభవన్‌లో ప్రభుత్వం నిర్వహించిన ‘నీళ్లు-నిజాలు’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఒక్క సంతకం.. తెలంగాణకు శాపం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన పునాది అయిన 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినాదాన్ని కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు 'మరణశాసనం' రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో, కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలంటూ కేసీఆర్ సంతకం చేశారు. దీనివల్ల ఏపీకి 512 టీఎంసీలు దక్కాయి. ఇది తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడమే. వాస్తవానికి నదీ పరివాహక ప్రాంతం ప్రకారం తెలంగాణకు 71 శాతం వాటా దక్కాలి. కానీ కేసీఆర్ కేవలం 34 శాతానికి అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు" అని రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు.  

"ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు పెట్టిన సంతకాలే తెలంగాణ పాలిట మరణ శాసనంగా మారాయి" అని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.  జూరాల ప్రాజెక్టు విషయంలో వీళ్లిద్దరినీ ఉరి తీసినా తప్పులేదు... ఇలాంటి వాళ్లను మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని వ్యాఖ్యానించారు. 

రాజకీయ మనుగడ కోసమే కొత్త డ్రామా

వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీపై పట్టు నిలుపుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి నీళ్ల పంచాయితీ మొదలుపెట్టారని ఆరోపించారు. ఇందుకోసం ఓ అబద్ధాల ప్రచార బృందాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులు-వినియోగం’ అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆయన కీలక వివరాలు వెల్లడించారు. 

"గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 27,000 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయింది. కనీస చట్టబద్ధమైన అనుమతులు కూడా లేకుండా పనులు ప్రారంభించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో నీటిపారుదల రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా, ఆశించిన స్థాయిలో కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయిందని, పైగా ప్రాజెక్టుల కోసం రూ. 96,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం మోపిందని ఆయన ఆరోపించారు.

జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, నీటిపారుదల రంగంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. "కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దాం. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి" అని సవాల్ విసిరారు. తెలంగాణ హక్కుల కోసం ట్రిబ్యునళ్ల వద్ద, చట్టపరంగా తమ ప్రభుత్వం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Revanth Reddy
KCR
Telangana
Krishna River
Water Rights
Harish Rao
Irrigation Projects
Telangana Politics
Uttam Kumar Reddy
Brs Party

More Telugu News